మహిళలకు ఏటా రూ.12 వేలు..చత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో బీజేపీ హామీ

మహిళలకు ఏటా రూ.12 వేలు..చత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో బీజేపీ హామీ

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రిలీజ్ చేసింది. పెండ్లి అయిన మహిళలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం ప్రకటించింది. పెండ్లి అయిన మహిళలకు ఏటా రూ.12 వేలను, భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. 18 లక్షల ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. రెండేండ్లలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ పెట్టిస్తామని తెలిపింది. 

క్వింటాలుకు రూ.3,100తో వడ్లను రైతుల నుంచి సేకరిస్తామని, ఒకేసారి డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని చెప్పింది. చత్తీస్‌గఢ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘మోదీ గ్యారంటీ ఫర్ 2023’ పేరుతో కేంద్ర మంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం రాయ్‌పూర్‌‌లో విడుదల చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను రెండేండ్లలో భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బీజేపీ విషయంలో ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో మాత్రమే కాదు.. ఓ సంకల్ప పాత్ర. మేం మా సంకల్పాన్ని నెరవేర్చి.. చత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. గతంలో బీమారు (వెనకబడిన) రాష్ట్రంగా ఉన్న చత్తీస్‌గఢ్‌ను 15 ఏండ్ల బీజేపీ పాలనలో ఓ మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో పని చేస్తామని బీజేపీ తరపున నేను మీకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. 

కాగా, కాంగ్రెస్ హయాంలో చత్తీస్‌గఢ్‌లో మత మార్పిడులు ఎక్కువయ్యాయని పాండరీయ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సభలో అమిత్ షా ఆరోపించారు.