దళితుల మధ్య బీజేపీ చిచ్చు

దళితుల మధ్య బీజేపీ చిచ్చు
  • ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్రలు: వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
  • నవంబర్​లో మాలల మహా బహిరంగ సభ
  • వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు మాల సంఘాల కృతజ్ఞతలు

ముషీరాబాద్, వెలుగు: దళితుల మధ్య ఐక్యత లేకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నదని ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవంబర్ నెలలో హైదరాబాద్​లో లక్షలాది మందితో మాలల మహా బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొంది. నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ హాజరై విజయవంతం చేసినందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య, కో చైర్మన్ బేరా బాలకిషన్, చెరుకు రాంచందర్ మంగళవారం సోమాజిగూడ లోని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 

రాష్ట్రంలోని 30 లక్షల మాలల హక్కుల కోసం గతంలో కాకా వెంకటస్వామి పోరాడారని ఇప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషి మాలలు ఎన్నటికీ  మర్చిపోరని తెలిపారు. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. మాలలను అవమానించే రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవన్నీ తిప్పి కొట్టడానికి నవంబర్ నెల చివరి వారంలో హైదరాబాదులో లక్షలాదిమంది మాలలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేక వెంకన్న, కరణం కిషన్, నరసింహయ్య, వినోద్ కుమార్, రాజు వస్తాద్, బూర్గుల వెంకటేశ్వర్లు, నల్లాల కనకరాజు, గోపూజ రమేశ్, గద్ద శీను, మాంచాల లింగస్వామి, మేకల సత్యనారాయణ, శ్రీరాములు, సర్వయ్య, బాలరాజ్, శంకర్, ధర్మేందర్, లక్ష్మీనారాయణ, కేశవులు తదితరులు పాల్గొన్నారు.