చేతగాక.. కేంద్రంపై నెడుతున్నడు: రఘునందన్ రావు

చేతగాక.. కేంద్రంపై నెడుతున్నడు: రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, ఆయనకు పాలన చేతగాక కేంద్రంపై నెడుతున్నారని బీజేపీ రాష్ట్ర  అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులు ఎక్కడ ఆగిపోయాయో వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంచి జరిగితే కేసీఆర్, చెడు జరిగితే కేంద్రంపై నెపం వేస్తూ చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్ మాట్లాడారు. ఏడాదిన్నరగా దేశ ఆర్థిక పరిస్థితులు తిరోగమనంలో ఉన్నాయంటున్న సీఎం, ఇంతకాలం నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు వేల కోట్ల ఖర్చుతో  కొత్త సెక్రటేరియట్ కట్టడం ఎందుకని అడిగారు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీ సోయం బాపూరావు సన్మాన సభకు వెళ్తానంటే బందోబస్తు ఇవ్వని డీజీపీ, ఇంకెవరికి బందోబస్తు ఇస్తారో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేయడానికే పోలీసులు ఉన్నారా? అని మండిపడ్డారు. ఒక ఎంపీకి రక్షణ కల్పించే సత్తా కూడా రాష్ట్ర పోలీసులకు లేదంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.