బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతది : తరుణ్‌ చుగ్‌

బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతది : తరుణ్‌ చుగ్‌

బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతది
తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ పోరాడుతోంది : చుగ్

న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ త్వరలో చరిత్రలో కలిసిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌గా మారినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రధాని మోడీపై ప్రజలు కురిపిస్తున్న అభిమానంతో తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, దోపిడీ, అహంకారంతో రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. ఈ దిశలో ప్రస్తుతం తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ పోరాడుతోందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తమ పార్టీ చాలా వేగంగా పుంజుకుంటున్నదని, క్షేత్రస్థాయిలో రోజురోజుకీ బలపడుతోందన్నారు. ఇందుకు కేసీఆర్ ను ప్రజలు ద్వేషించడమే కారణమని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్తారన్నారు. ఈ దిశలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని ఘోరంగా ఓడించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు.