అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యక్రమాలు చేపట్టండి

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యక్రమాలు చేపట్టండి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యక్రమాలు చేపట్టాలని, స్థానిక సమస్యలపై పోరాడాలని పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సూచించారు. నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మూడింటిని ఎంచుకుని, జనంలోకి వెళ్లేలా ఉద్యమాలు చేయాలని చెప్పారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల పనులు పెండింగ్‌‌లో పడిపోవడంపైనా ఫైట్ చేయాలన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోర్ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు సమీక్షలు జరిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు రెండు గంటల చొప్పున సమయాన్ని కేటాయించి.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న నేతల వివరాలను సేకరించారు. ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో నియోజకవర్గాల వారీగా చేపడుతున్న ర్యాలీల పురోగతి వివరాలను సేకరించారు.

టికెట్లపై ఎవరికీ గ్యారంటీ లేదు

“అసెంబ్లీ టికెట్ విషయంలో ఎవరికీ గ్యారంటీ లేదు. గ్రౌండ్ రిపోర్ట్ మేరకు గెలిచే అవకాశం ఉన్న వాళ్లకు మాత్రమే టికెట్లు వస్తాయి. అంతే తప్ప ఎవరో హామీ ఇచ్చారని నమ్మి మోసపోవద్దు” అని బండి సంజయ్ సూచించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే కార్యక్రమాలపై జిల్లాల వారీగా 10 మందితో కమిటీ వేయాలని, కొత్త కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛ భారత్, రక్తదాన, వైద్య, క్రీడా శిబిరాలు నిర్వహించాలన్నారు. జేపీ నడ్డా నేరుగా జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతారన్నారు. మోడీ జీవిత విశేషాలు, కేంద్ర సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషన్ నిర్వహించాలని పేర్కొన్నారు. దేశంలో వినూత్నంగా, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించే 25 బెస్ట్ మండలాలు, 10 జిల్లాల అధ్యక్షులను గుర్తించి ఢిల్లీలో సన్మానం చేస్తామని వివరించారు. పార్టీలో వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు ద్రోహం చేస్తున్నారనే వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువతను చేర్చుకోండి

18 ఏండ్లు పైబడిన యువతను యువ మోర్చాలోకి తీసుకోవాలని, 26 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిని పార్టీలోకి చేర్చుకునే అంశంపై దృష్టి పెట్టాలని నేతలకు తరుణ్ చుగ్ సూచించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 40 వేల మిస్డ్ కాల్స్ రావాలని, ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామ గ్రామాన ప్రజా గోస- బీజేపీ భరోసా ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తప్పిదాలు, స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలతోపాటు అసెంబ్లీ సెగ్మెంట్‌‌లోని ముఖ్యమైన అంశాలను ఎంపీ ధర్మపురి అర్వింద్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, కేంద్ర నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పని చేయకుండా పెండింగ్‌‌లో ఉన్న పనుల వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, నేతలు ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అవినీతి పాలన: తరుణ్​ చుగ్

రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, ఆ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్ అన్నారు. సీఎం కేసీఆర్ గాఢ నిద్రలో ఉన్నారని విమర్శించారు. ఆదివారం ఖైరతాబాద్ రెడ్ హిల్స్​లో బీజేపీ కార్యకర్త కరణ్ సింగ్ ఇంటికి వెళ్లిన తరుణ్ చుగ్.. ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. కాలనీలోని గణేశ్ మండపంలో పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తోందని, పరేడ్ గ్రౌండ్​లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని చుగ్ గుర్తుచేశారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ సీఎంలకు కేంద్రం తరఫున ఇన్విటేషన్లు పంపామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ రాములు పాల్గొన్నారు.