
- పాలకుర్తిలో కర్ఫ్యూ వాతావరణం తెచ్చిన సీపీ సంగతి చూస్తం
- జనగామ జిల్లా పాలకుర్తిలో సంజయ్ పాదయాత్ర
- మూడో విడత యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి
జనగామ, వెలుగు: ‘‘తెలంగాణలో రాక్షస పాలన నడుస్తున్నది. కేసీఆర్.. ఖాసీం చంద్రశేఖర్ రిజ్వీ, విస్నూరు దొరలా మారిండు. కేసీఆర్ రాజ్యాంగాన్ని బొందపెట్టి.. రామరాజ్యం తెచ్చి తీరుతాం” అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం విస్నూరు నుంచి మొదలైన యాత్ర వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణపురం స్టేజీ, పాలకుర్తి, తొర్రూరు, శాతాపురం, ధర్మతండా స్టేజీ, కడవెండి మీదుగా 16 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. ‘‘అరేయ్ అంటే.. ఒరేయ్ అంటాం. ఎవరికీ భయపడం.. మేం తెగించి కొట్లాడడానికే వచ్చాం. కేసీఆర్ రాజ్యాంగాన్ని బొందపెట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర. పాస్ పోర్టుల బ్రోకర్ రాజ్యమేలితే ఇలానే ఉంటుంది”అని విమర్శించారు. తెలంగాణ వచ్చినా బతుకులు మారలేదని, మంచి పాలన కోసం తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల పురిటిగడ్డ పాలకుర్తి నుంచే యుద్ధం మొదలు కావాలన్నారు.
సీపీ.. టీఆర్ఎస్‌లో చేరు
‘‘కేసీఆర్ కొడుకు పేరు సయ్యద్ మక్బూల్.. అతనే ట్విట్టర్ టిల్లు. పాలకుర్తిలో కూడా నిజాం రాజ్యం నడుస్తున్నది. బీజేపీ ప్రజాదరణను అడ్డుకోలేరని ప్రగతి భవన్ కో.. ఫామ్‌హౌస్‌కో ఫోన్ చేసి మీ ట్విట్టర్ టిల్లుకు చెప్పండి” అని సంజయ్ అన్నారు. పాలకుర్తిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించిన సీపీ టీఆర్ఎస్‌లో చేరాలని అన్నారు. ‘‘ఓ కలెక్టర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టే.. నీకూ ఎమ్మెల్సీనో ఇంకేదో ఇస్తడు. కేసీఆర్ సర్కారు ఇంకో ఆర్నెల్లో సంవత్సరమో ఉంటది.. సీపీకి దమ్ముంటే రాళ్లు వేసే వాళ్లను అరెస్టు చేయాలి. టీఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగుతూ పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తున్నడు. నిన్న బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టించాడు. టీఆర్ఎస్ వాళ్లు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటే.. సీపీ మా కార్యకర్తలపైనే కేసులు పెడ్తరా? ఎవరెన్ని కుట్రలు చేసినా పాలకుర్తిలో కాషాయ జెండా ఎగరేస్తం” అని సంజయ్ అన్నారు.
కేసీఆర్ మెడలు వంచుతం
సమైక్య రాష్ట్రంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరపాలని డిమాండ్ చేస్తూ వచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక నిర్వహించట్లేదని సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇంకో నెల గడువుంది. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుంటే.. కేసీఆర్ మెడలు వంచి జరిపిస్తం” అని హెచ్చరించారు. ‘‘ఖమ్మం ఆస్పత్రిలో, ఢిల్లీలో కూడా దొంగ దీక్ష చేసిండు. దీక్షల్లో కేసీఆర్ మందు తాగిండని నిరూపిస్త” అని అన్నారు. ‘‘ఈ మూర్ఖుడు ఎనిమిదేండ్లలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇచ్చిండు? కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది” అని చెప్పారు.
ఉచిత పథకాలను మోడీ వద్దనలే
‘‘ఉచిత పథకాలను మోడీ వద్దనలే. సంక్షేమ పథకాల ఉచితాలకు ప్రధాని వ్యతిరేకం కాదు. అదే నిజమైతే ఉచిత బియ్యం.. ఉచిత వ్యాక్సిన్లు ఎందుకు ఇస్తం. టీఆర్ఎస్ కావాలని దుష్ప్రచారం చేస్తున్నది” అని బండి సంజయ్ మండిపడ్డారు. ఉచితాల పేరుతో కేసీఆర్ చేసే దోపిడీ మాత్రమే వద్దంటున్నామన్నారు.
మునుగోడులో ముప్పై వేలిస్తరట
‘‘దుబ్బాకలో ఓటుకు రూ.10 వేలు, హుజూరాబాద్‌లో రూ.20 వేలు ఇచ్చిండు. అయినా ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పారు. మునుగోడులో ఓటుకు రూ.30 వేలు ఇస్తడట. అవి తీస్కొని పువ్వు గుర్తుకే ఓటు వెయ్యాలె” అని ప్రజలను బండి సంజయ్ కోరారు. జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, హనుమకొండ, వరంగల్ అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, నేతలు బొడిగె శోభ, మార్తినేని ధర్మారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
సంజయ్‌ని కలిసిన వివేక్ వెంకటస్వామి
ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్‌ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితోపాటు గరికపాటి మోహన్ రావు కలిశారు. సోమవారం యాత్రలో జరిగిన దాడి, తదితర అంశాలను చర్చించి యాత్రలో పాల్గొన్నారు. మూడో విడత సంగ్రామ యాత్ర మంగళవారంతో వెయ్యి కిలోమీటర్లకు చేరింది.
గాయపడ్డ బీజేపీ కార్యకర్త పరిస్థితి విషమం
జనగామ జిల్లా దేవరుప్పుల దాడి ఘటనలో తలకు గాయాలైన బీజేపీ కార్యకర్త, గుండాల సర్పంచ్ రావుల మల్లేశ్ పరిస్థితి విషమంగా మారినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనగామ జిల్లా హాస్పిటల్ నుంచి సోమవారం సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మెడ నరాలు చిట్లడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. బాధిత కుటుంబంతో సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు.పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దేశంలోనే ఫెయిల్యూర్ సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: సుపరిపాలన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాలిగోటికి కూడా కేసీఆర్ సరిపోరని సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇప్పటి వరకు అవినీతి మరక అంటకుండా దేశాన్ని ఏలుతున్న నాయకుడు మోడీ. అలాంటి నాయకుడిని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. దేశంలోనే ఫెయిల్యూర్ సీఎం కేసీఆర్” అని ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినందున వికారాబాద్‌లో సభ పెట్టి ఇంకోసారి ప్రజలకు మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వికారాబాద్ వేదికగా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు.