
- వేల మంది గుంపులుగా వచ్చినా కంట్రోల్ చేయలే: సంజయ్
- సికింద్రాబాద్ విధ్వంసంపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్
- బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన టీఆర్‌ఎస్ సర్కార్ వాటికి భంగం కలిగించడం సిగ్గుచేటని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్టేషన్ లో విధ్వంసం జరిగిందన్నారు. వేలాది మంది రైల్వే స్టేషన్ కు గుంపులుగా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదు? దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిగితేనే అసలు దోషులు ఎవరో తేలుతుందన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో జులై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి సంజయ్ సోమవారం పరిశీలించారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. పార్టీ సమావేశాలకు ఢిల్లీ నుంచి వచ్చే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర గెస్టులను రిసీవ్ చేసుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ పథకంపై ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తామన్నారు.
మోడీ సభకు 10 లక్షల మంది
జులై 3న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోడీ సభకు 10 లక్షల మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నామని సంజయ్ చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 350 మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశాల నిర్వహణకు 50 వేల మంది నుంచి నిధిని సేకరిస్తున్నామని, ఆన్ లైన్ ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలని కోరారు. కాగా, బీజేపీలో ఏ నాయకుడైనా, ఎప్పుడైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవవచ్చని సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం అమిత్ షా తో పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మన్ సామ వెంకట్ రెడ్డి సోమవారం నోవాటెల్ వద్ద బండి సంజయ్ ని కలిశారు. ఆయన ఈ నెల 25 న బీజేపీలో చేరనున్నారు. కాగా, హైదరాబాద్ లో సమావేశాల ఏర్పాట్లపై బీజేపీపెద్దలతో చర్చించేందుకు బుధవారం పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.