జీపీల అభివృద్ధికి నిధులిచ్చేది కేంద్రమే : రాంచందర్ రావు

జీపీల అభివృద్ధికి నిధులిచ్చేది కేంద్రమే :  రాంచందర్ రావు
  • ఈ విషయాన్ని గ్రామాల్లో  ప్రచారం చేయండి
  • కేడర్​కు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పిలుపు 

హైదరాబాద్, వెలుగు: గ్రామపంచాయతీల అభివృద్ధికి  కేంద్రప్రభుత్వం మాత్రమే నిధులిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. గ్రామీణ రోడ్లు, పీఎం కిసాన్ నిధులు, మరుగుదొడ్లు, గ్రామీణ ఉపాధిహామీ పథకం, వీధి దీపాలు, శ్మశానవాటికల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వాస్తవాలను బీజేపీ శ్రేణులు ప్రతి గ్రామానికి  చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో రాంచందర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు. వారికి పార్టీ శ్రేణులు బలమైన మద్దతు అందించి, అత్యధిక స్థానాల్లో గెలిపించాలనే దిశగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు తీవ్ర దుర్భర స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. 

అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి శ్రేణులు కృషి చేయాలని రాంచందర్ రావు కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. 

అంబేద్కర్​ను గౌరవించింది మోదీనే

అంబేద్కర్ కు సరైన గౌరవం దక్కింది ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు స్పష్టం చేశారు. అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ఐదు ప్రాంతాలను ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేశారని వెల్లడించారు. రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీకి ఏమీ తెలియదని, చేతిలో బుక్కు పట్టుకుని తిరిగితే సరిపోదని ఎద్దేవా చేశారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  జరిగిన కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొని మాట్లాడారు. 

గతంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తే.. ఆమె ఏకంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని గుర్తు చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టారని, ఈ ఫేక్ ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు కూడా నడుస్తోందన్నారు. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, ఆర్థిక భారం తగ్గించేందుకు 'వన్ నేషన్ – వన్ ఎలక్షన్' విధానానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు.