ప్రజల్లోకి పోదాం.. మోదీని గెలిపిద్దాం .. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో విజయం చారిత్రాత్మక అవసరం

ప్రజల్లోకి పోదాం..  మోదీని గెలిపిద్దాం .. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో విజయం చారిత్రాత్మక అవసరం
  • బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో మూడు తీర్మానాలు
  • రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పార్టీకి ఓట్లు పెరిగినయ్
  • కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు విజ్ఞప్తి
  • లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిపించాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో విజయం చారిత్రాత్మక అవసరమని బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో నేతలు తీర్మానించారు. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రధాని మోదీని మరోసారి గెలిపించాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా ఓట్లు సాధించిందని నేతలు వెల్లడించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌‌‌‌లో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో 3 తీర్మానాలు చేశారు. 

వీటిని మీడియాకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు, సీట్లు.. గత 10 ఏండ్ల మోదీ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం చారిత్రాత్మక అవసరం.. అంటూ మూడు తీర్మానాలు చేశారు. “2018లో ఒక సీటుకు పరిమితమైతే.. 2023లో 8 స్థానాల్లో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఓటింగ్‌‌‌‌ శాతం పెరిగింది. 

మరో 19 నియోజకవర్గాల్లో పార్టీ రెండో స్థానంలో నిలిచింది. మరో 24 సీట్లలో 50 వేల నుంచి లక్ష వరకు ఓట్లు వచ్చాయి. 75 నియోజకవర్గాల్లో 20 వేలకు వరకు ఓట్లు పార్టీ సాధించింది. 2018లో నమోదైన 6.9 శాతం నుంచి 14 శాతానికి ఓట్లు పెరిగాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌, పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని ఓడించి.. బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డికి చారిత్రాక విజయాన్ని అందించిన కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు’’ అని తీర్మానం చేశారు. 

రెండు పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో అలవికాని హామీలతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ల నైజాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని తీర్మానంలో బీజేపీ నేతలు పేర్కొన్నారు. రెండు పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తే.. వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ పాలనకు తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని, ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మీటింగ్‌‌‌‌లకు మంచి స్పందన వచ్చిందని వివరించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా మోదీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని నేతలు తెలిపారు. 10 ఏండ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లు ఇంటింటికీ తీసుకెళ్లాలని, మరోసారి మోదీని గెలిపించేందుకు తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.