బీజేవైఎం నేతల అరెస్టుపై బండి సంజయ్ ఫైర్

బీజేవైఎం నేతల అరెస్టుపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ క్వశ్చన్​ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడమేమిటని మండిపడ్డారు. బీజేవైఎం లీడర్ల అరెస్టులను ఖండిస్తున్నామని, అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని నమ్మిన సిద్ధాంతం, ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతారని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంజయ్ హెచ్చరించారు. పేపర్ల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిట్​కు అప్పగించిన నయీం, డ్రగ్స్, డేటా చోరీ కేసులన్నీ నీరుగారిపోయాయని, పేపర్ల లీకేజీ కేసును కూడా నీరుగార్చేందుకే సిట్​కు అప్పగించిందని మండిపడ్డారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

రజ్వీని మించిన నియంత కేసీఆర్ : డీకే అరుణ

పేపర్ల లీకేజీ కేసులో దోషులను వదిలేసి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్.. ఖాసీం రజ్వీని మించిన నియంతగా మారిపోయారన్నారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కుతోందని ఫైర్​ అయ్యారు. బేషరతుగా బీజేవైఎం కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కని, దానిని కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగ పరీక్షనూ సరిగ్గా నిర్వహించలేదని, ఇది కేసీఆర్ సర్కార్ చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో ఇంటర్, ఎంసెట్ విద్యార్థులు ఇబ్బందిపడ్డారని, సీఎం కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్​ విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. కేసీఆర్​కు ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి లేదని, అందువల్లే  రకరకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

నిరుద్యోగులు అల్లాడుతున్నరు : విశ్వేశ్వర్​ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ తుగ్లక్ పాలనతో యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, తొమ్మిదేండ్లుగా ఉద్యోగ నియామకాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో జారీ చేసిన అరకొర నోటిఫికేషన్లు తప్పులతడకగా ఉన్నాయని, ఇప్పుడు పేపర్ల లీకేజీ పేరుతో అభ్యర్థుల జీవితాలను ఆగంజేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేస్తే వారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్యంలో కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంట్లో అందరికీ పదవులిచ్చిన కేసీఆర్.. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలివ్వకుండా రోడ్డునపడేశారని విమర్శించారు. పేపర్ లీకేజీ విషయంలో టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కేసీఆర్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.