ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

హైదరాబాద్: కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం... తానే హింసకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. తనను పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిర్బంధంపై మేధావులు స్పందించాలన్నారు. పాతబస్తీ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోని కేసీఆర్... ఎంఐఎం సహకారంతో అల్లర్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని... ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే చాలా మంది ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. 

కాగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము చేపట్టిన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని అందులో పేర్కొంటూ బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ కేసును హైకోర్టు విచారణకు చేపట్టగా... శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు యాత్రకు నిరాకరించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆయన కామెంట్ల వల్ల మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 

ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పడు అనుమతి లేదని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్రను నిలిపేశారో ఆధారాలను ఇవాళ సమర్పించాలని ఆదేశించింది. తమ దగ్గర ఉన్న వీడియోలను ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందుంచుతామని తరపు న్యాయవాది న్యాయమూర్తికి చెప్పారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది.