బీజేపీకి భయపడే సమైక్యతా ఉత్సవాలు

బీజేపీకి భయపడే సమైక్యతా ఉత్సవాలు

హైదరాబాద్: సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం కాదని... సీఎం కేసీఆర్ కు దమ్ముంటే దళితుడిని సీఎం చేయాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే మొదటి సీఎం చేస్తా అని మాట తప్పిన కేసీఆర్... కనీసం కొత్త సెక్రటేరియట్ లోనైనా దళితుడిని సీఎంగా కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. దళితులపై నిజంగా గౌరవం ఉంటే ఇప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దళితుడినే సీఎంగా కొనసాగించాలని అన్నారు.

దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమను చూపిస్తున్నారని, కేసీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా ఏనాడు  అంబేద్కర్ జయంతి, వర్థంతి ఉత్సవాలకు హాజరు కాని సీఎం... ఇవాళ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టగానే దళితుల పక్షపాతి అవుతారా అని ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ దళితులపై లేనిపోని ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలను వంద శాతం అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. పంచతీర్థాల పేరుతో అంబేద్కర్ జీవితంలో భాగమైన ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు. 

బీజేపీకి భయపడే ఉత్సవాలు చేస్తుండు

బీజేపీకి భయపడే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. ఎవరిని సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ ఈ ఉత్సవాలను జరుపుతున్నారో చెప్పాలని నిలదీశారు. సమైక్యత పేరుతో ఉత్సవాలను నిర్వహించడం సైనికులను అవమానించడమేనని సంజయ్ ఆరోపించారు. అంతకుముందు ఏనాడూ సెప్టెంబర్ 17 గురించి పట్టించుకోని కేసీఆర్... ఇవాళ బీజేపీకి వస్తోన్న ఆదరణను చూసి ఉత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు. సర్దార్ పటేల్ కృషి వల్లే హైదరాబాద్ సంస్థానం దేశంలో అంతర్భాగమైందని, లేకుంటే పాకిస్థాన్ లో కలిసేదన్నారు. పాకిస్థాన్ లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలన్న నిజాం రాజుకు కేసీఆర్ వారసుడిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఎంఐఎంకు కేసీఆర్ భయపడుతున్నారని, దమ్ముంటే సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరపాలని సవాల్ విసిరారు.