మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారం

 మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారం

మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం చేసిన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కేసీఆర్ చెప్పేటివన్నీ అబద్ధాలని.. కేసీఆర్ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగివుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బాయికాడ మీటర్లు పెడ్తరని రైతులను కేసీఆర్‌ తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కేసీఆర్ నిరూపించగలడా అని ప్రశ్నించారు. 

ఉచిత కరెంట్‌ ఇవ్వడం కేసీఆర్‌కు చేతగావడంలేదని బండి సంజయ్ విమర్శించారు. కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోందని మండిపడ్డారు. కరెంట్‌ కొనుగోలు పేరుతో రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల వద్ద 50 వేల కోట్ల అప్పు చేశారని.. ఇప్పుడా అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేంద్రంపై విషప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలను అరిగోస పెడుతూ..రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌ పాలనపై పోరాడాల్సిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారిపోయారని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్రగులాబీలుగా మారి కేసీఆర్‌ చంకన చేరారని విమర్శించారు.