ప్రధాని పర్యటనపై కేంద్ర అధికారులతో బండి సంజయ్ భేటీ

ప్రధాని పర్యటనపై కేంద్ర అధికారులతో బండి సంజయ్ భేటీ

కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈనెల 12న ప్రధాని మోడీ ఎల్కతుర్తి – సిద్దిపేట – మెదక్  జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన ఏర్పాట్లతో పాటు జగిత్యాల- కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభం, భూసేకరణ వంటి అంశాలపైనా  చర్చించారు. మరోవైపు జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ హైవే విస్తరణ పనులు సైతం అతి త్వరలో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే కేంద్ర  రోడ్లు, రవాణా శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

జగిత్యాల నుండి కరీంనగర్ వరకు మొత్తం 58.86 కి.మీల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 2,151 కోట్ల 63 లక్షల వ్యయం కానుందని అధికారులు బండి సంజయ్ కు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కరీంనగర్ నుండి వరంగల్ వరకు మొత్తం 68 కి.మీల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని.. ఇందుకోసం 2,148 కోట్ల 86 లక్షల అంచనా వ్యయంగా అధికారులు పేర్కొన్నారు.

మొత్తంగా జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం కేంద్రం 4,300 కోట్ల 49 లక్షలు ఖర్చు చేయనుంది. ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసిందని వెల్లడించిన అధికారులు అతిత్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను సంజయ్ కోరారు