
తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలకు పిలుపునిస్తే స్పందన లేదని సెప్టెంబర్ 17న సెలవు ప్రకటిస్తారా..? అంటూ సీఎం కేసీఆర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపకుండా అడ్డుకునేందుకే ‘సెలవు’ పేరుతో సీఎం కేసీఆర్ కుట్ర పన్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి సెలవులు ఇచ్చే రోజులు త్వరలోనే రాబోతున్నాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.
‘రజాకార్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రోజున (సెప్టెంబర్ 17న) తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యా సంస్థలోనూ జాతీయ జెండాలు ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే.. అందుకు భిన్నంగా జాతీయ జెండాలు ఎగరనీయకుండా కేసీఆర్ ప్రభుత్వం సెలవు ప్రకటించడం దుర్మార్గపు చర్య. ఇదేనా మీకు ఉన్న నిబద్ధత..?’ అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టి ఉత్సవాలు నిర్వహించినా..ప్రజల నుండి స్పందన లేదని బండి సంజయ్ అన్నారు. సొంత పార్టీల నేతలు కుమ్మలాటలకు, చిందులేయడానికే ఉత్సవాలు పరిమితమయ్యాయని సెటైర్ వేశారు. 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరిగితే కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే ‘సెలవు’ పేరుతో కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.
తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిసి.. కేసీఆర్ వణికిపోతున్నారని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీజేపీ ఏర్పాటు చేసిన పోస్టర్లను చించివేయిస్తూ..తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, గొడవలు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ కుట్రలకు తెరలేపారంటూ ఆరోపించారు.