- నెరవేరని గ్యారంటీలపై ఆయనకు వినతిపత్రం ఇస్తాం
- సీఎంకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు లేఖ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోతే, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లుగా భావిస్తామని స్పష్టం చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు స్వయంగా ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేశారని గుర్తుచేశారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 సాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, కాలేజీ అమ్మాయిలకు ఉచిత స్కూటర్ల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. నెరవేరని హామీలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇస్తామని తెలిపారు.
మానసిక ప్రశాంతతకు యోగా ఏకైక మార్గం..
మానసిక ప్రశాంతతకు యోగా ఏకైక మార్గమని ఎన్.రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ చొరవతోనే యోగా నేడు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందన్నారు.
యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక శ్రేయస్సును బలోపేతం చేసే సంపూర్ణ జీవన విధానమని, దీనిని ప్రతిఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భారత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
