రాష్ట్రంలో నియామక పత్రాలు ఇచ్చి.. పోస్టింగ్లు మరిచారు!..సెకండరీ హెల్త్, ఆయుష్ నర్సింగ్ ఆఫీసర్ల పట్ల నిర్లక్ష్యం

రాష్ట్రంలో నియామక పత్రాలు ఇచ్చి..  పోస్టింగ్లు మరిచారు!..సెకండరీ హెల్త్, ఆయుష్ నర్సింగ్ ఆఫీసర్ల పట్ల నిర్లక్ష్యం
  • అపాయింట్​మెంట్ లెటర్లు ఇచ్చి నెల దాటినా అందని కౌన్సిలింగ్ షెడ్యూల్
  •     డీఎంఈ, డీహెచ్ విభాగాల్లో చురుగ్గా సాగుతున్న రిక్రూట్మెంట్ ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియలో కొన్ని డిపార్ట్​మెంట్లను అధికారులు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గత మే 12న ఆరోగ్య శాఖ మంత్రి దమోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. అయితే, సెకండరీ హెల్త్ సర్వీసెస్ (332 మంది), ఆయుష్ (61 మంది) విభాగాల్లో ఎంపికైన వారికి పోస్టింగ్ ఊసే లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 1,576 మందికి  నేటి నుంచి 24వ వరకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆర్డర్లు ఇచ్చేందుకు షెడ్యూల్ విడుదల కావడంతోపాటు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) అభ్యర్థులకు 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఖరారైంది. కానీ, సెకండరీ, ఆయుష్ డిపార్ట్​మెంట్లకు చెందిన 393 మంది అభ్యర్థుల విషయంలో హెడ్ ఆఫీసుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందులతో సతమతం.. 

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ధీమాతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొలువులు వదులుకున్నామని, ఇటు ప్రభుత్వ ఉద్యోగం లేట్ అవ్వడంతో ఆర్థికంగా కుదేలవుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా తదుపరి ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నా, అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. సెకండరీ హెల్త్ విభాగానికి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీనే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జ్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఉన్నందున, ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర విభాగాల అభ్యర్థులు విధుల్లో చేరుతుంటే, తమకు మాత్రం పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల నష్టం జరుగుతోందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయాలని, లేనిపక్షంలో సెకండరీ హెల్త్, ఆయుష్ కార్యాలయాలను  ముట్టడిస్తామని హెచ్చరించారు.