- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : రిటైర్డ్ ఉద్యోగులకు కీలక పదవులు ఇవ్వడంపై ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయా పదవులను నిరుద్యోగ యువతకు కేటాయించడం ద్వారా వారికి మెరుగైన అవకాశాలు కల్పించవచ్చన్నారు.
సమాజంలో అవినీతి పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన జరిగితేనే అవినీతి అంతం అవుతుందని చెప్పారు. నల్గొండలోని తన క్యాంపు ఆఫీస్ లో ఆదివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా 'భూభారతి' వచ్చినా.. భూ వ్యవహారాల్లో అవినీతి తగ్గలేదన్నారు.
ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రజలతో కలిసే నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేవారని, కానీ ఇప్పుడు రాజకీయాల స్వరూపమే మారిపోయిందన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ వర్గాలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైర్డ్ ఆఫీసర్లు రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు.
ప్రజలు ఉచిత పథకాలపై ఆధారపడే పరిస్థితిని క్రమంగా తగ్గించాలని సూచించారు. వ్యవసాయం చేయని నిరుపయోగ భూములకు కూడా రైతుబంధు ఇవ్వడం సరికాదన్నారు. ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేసిన తర్వాత నిజమైన అర్హులకు సాయం అందించాలని సూచించారు.
