- యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య
సైఫాబాద్, వెలుగు : డ్రగ్స్ ఫ్రీ- యంగ్ ఇండియా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ ఫోర్స్ సహకారంతో హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియం తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ‘శపథ్’ పేరుతో యువతకు అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, మాజీ ఎంపీ గిరీశ్ సంఘీ, ఈగల్స్ ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణామూర్తి గుప్తా, శపథ్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు రామ్ నివాస్ బన్సల్ పాల్గొన్నారు.
సందీప్ శాండిల్య మాట్లాడుతూ తెలంగాణలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుందన్నారు. 2019 నాటికి తెలంగాణలో వివిధ రకాల డ్రగ్స్ బారిన పడిన వారి సంఖ్య 22.5 లక్షలు కాగా, 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై ఉండవచ్చని అంచనా వేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలోని 100 మంది సిబ్బందితో వ్యసనపరులను పర్యవేక్షించడం సాధ్యం కాదని , తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనించాలని సూచించారు. సమాజంలోని వివిధ కుల సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ బాధ్యతగా ముందుకొచ్చి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
