
- ఖమ్మంలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
ఖమ్మం, వెలుగు: కేంద్రం సప్లై చేసిన యూరియా రాష్ట్రంలో పక్కదారి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లిందని నిరూపిస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఎరువుల కొరతకు సంబంధించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యమని అన్నారు. మంగళవారం ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
2024-–25 యాసంగిలో రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే.. కేంద్రం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు పంపిందన్నారు. డీఏపీ 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 1.74 లక్షల మెట్రిక్ టన్నులు అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలోనే లోపం ఉందని, బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడంలో విఫలమై కేంద్రంపై విమర్శలు చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పడు ఎరువుల దుకాణాల ముందు రైతులు క్యూలైన్లలో నిల్చొనేవారని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఎరువుల కొరతన్నదే లేదని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో అర్థం కావడం లేదని రాంచందర్‌రావు అన్నారు. ‘‘పార్టీ అధ్యక్షుడో, ముఖ్యమంత్రో పాదయాత్ర చేస్తరు. కానీ, ఇక్కడ మాత్రం పార్టీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారట. కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. ఆయనకు తన కుర్చీని కాపాడుకోవడానికే సమయం సరిపోతోంది. ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ మంత్రులు కలిసి సీఎంని పనిచేయనీయడం లేదు”అని వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటున్న కాంగ్రెస్ అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడానికి కుట్ర చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. “ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదు, ముస్లింల రిజర్వేషన్ బిల్లు”అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 50 సీట్లలో 35 ముస్లింలు గెలిచారని, ఇది బీసీలకు అన్యాయమేనన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లా అభివృద్ధికి ఏమీ చేయడం లేదని, వారికి కుర్చీ యావ తప్ప ప్రజల గురించి ఆలోచన లేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఖమ్మం నగరంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.