హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని, ఇది ప్రజలను వంచించే ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, ఒక్క రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బహుశా పొరపాటున పాత బడ్జెట్‌నే మళ్లీ చదివారేమో అని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందన్నారు. పక్క రాష్ట్రాలైన ఏపీ విద్యకు 13 శాతం, బీహార్ 21 శాతం కేటాయిస్తుంటే.. తెలంగాణలో మాత్రం కేవలం 8 శాతమేనా? అని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం, పెన్షన్ల భారాన్ని కూడా ఆ డిపార్ట్‌మెంట్‌పైనే వేసి దాన్ని దివాళా తీయిస్తోందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలన్నీ ప్రధాని మోదీ పుణ్యమేనని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రమే నిధులిస్తున్నదని, రాష్ట్రం కేవలం భూసేకరణ మాత్రమే చేస్తున్నదని గుర్తు చేశారు.
కాంగ్రెస్సర్కార్వి అబద్ధాలు
రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలు ఆడుతోందని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారనీ, ఎకరాకు రూ.45 వేల పైగా రైతుకు బాకీ పడ్డారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు, మహిళలకు రూ.2,500 ఊసే ఈ బడ్జెట్‌లో లేదన్నారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం రెండు రోజుల్లోనే రూ. 5వేల కోట్ల నుంచి రూ. 7వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని, అర్చకుల వేతనాలను పట్టించుకోని ప్రభుత్వం.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మైనారిటీ బడ్జెట్‌ను రూ.700 కోట్లు పెంచిందని విమర్శించారు.
