- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరిగింది
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తేస్తరని ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఒకప్పుడు మజ్లిస్ గ్యారేజ్‌లో ఉన్న ఆ ‘కారు’.. బయటికి వచ్చినా ఇప్పుడు రాజకీయంగా పంచర్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ‘‘ఆ కారుకు డ్రైవర్ లేడు. స్టీరింగ్ లేదు. టైర్లు ఊడిపోయాయి. ఇక పర్మనెంట్ గా షెడ్డులోనే ఉంటుంది.
అలాంటి కారులో నుంచి బయటకి వచ్చిన వాళ్లు ఏం మాట్లాడినా, దానికి స్పందించాల్సిన అవసరమే లేదు”అని కవితను ఉద్దేశించి రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పడేండ్ల కేసీఆర్ పాలనలో అమరవీరులకు అన్యాయం జరిగిందని చేప్తున్న కవిత.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో అమరవీరులకే కాదు.. ప్రజలందరికీ అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ గతంలో ఉద్యోగులను మోసం చేసినట్టే.. రేవంత్ కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు డీఏల్లో 5 డీఏలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ఓ మంత్రి ఓఎస్డీ గన్ తో సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ ను బెదిరించారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జంట నగరాల్లో రౌడీ షీటర్లపై కేసులు ఎత్తేస్తుందని, వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్స్ లు జారీ చేస్తుందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డమ్మీ ఎవరు అనేది ప్రజలు తేలుస్తారని పేర్కొన్నారు.
మజ్లిస్‌కు బీజేపీకి మధ్యే పోటీ..
జూబ్లీహిల్స్ లో మజ్లిస్ కు బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుందని రాంచదర్ రావు అన్నారు. మజ్లిస్ ను ఆపాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక శక్తి కేంద్ర ఇన్ చార్జీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాంచదర్ రావు మాట్లాడుతూ.. ప్రజల్లోనూ బీజేపీని గెలిపించాలనే ఆలోచన వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే.. దానికి నాంది జూబ్లీహిల్స్ నుంచే పడాలని పిలుపునిచ్చారు.
మంగళవారం జూబ్లీహిల్స్ లో పాదయాత్ర చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్ గౌతమ్ రావు, వేముల అశోక్, పార్టీ ఇన్ చార్జి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
