రాజకీయాలంటే ఆడంబరం కాదు.. సేవ దీన్‌‌‌‌‌‌‌‌ దయాళ్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ చూపిన బాటలోనే బీజేపీ ప్రయాణం : రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు  

రాజకీయాలంటే ఆడంబరం కాదు.. సేవ దీన్‌‌‌‌‌‌‌‌ దయాళ్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ చూపిన బాటలోనే బీజేపీ ప్రయాణం : రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు  
  • బీజేపీ స్టేట్ ఆఫీసులో పండిట్‌‌‌‌‌‌‌‌ దీన్‌‌‌‌‌‌‌‌ దయాళ్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ వర్ధంతి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాజకీయం అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని.. అదొక పవిత్రమైన సేవ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్​రావు అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన జీవితం ద్వారా ఇది నిరూపించారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్న హంగామా, ఆర్భాటాల మధ్య ఆయన నిరాడంబర జీవితం ప్రతి నేతకూ ఆదర్శమని పేర్కొన్నారు.

రాజకీయాల్లో విద్వేషాలు, కుట్రలకు తావులేకుండా.. ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు మాట్లాడుతూ.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అత్యంత సాధారణ జీవితం గడిపేవారని గుర్తుచేశారు.

ఎప్పుడూ రైల్లో థర్డ్ క్లాస్ కంపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించేవారని, స్వయంగా తన పనులు తానే చేసుకునే వారని కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరైన ఆయన చూపిన మార్గం వల్లే.. 1980లో పుట్టిన బీజేపీ నేడు దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిందని, పార్టీ ఈ స్థాయికి చేరడం వెనుక ఆయన త్యాగఫలం ఉందని అన్నారు.  

సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న 'అంత్యోదయ' స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు. దీన్ దయాళ్ మరణం వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రాకపోవడం బాధాకరమన్న ఆయన, కార్యకర్తలు ఆ మహనీయుడి సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.