
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు
చేవెళ్ల, వెలుగు : రైతుభరోసా విషయంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇస్తే, రైతుభరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రెండేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే ఇచ్చిందన్నారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గంలోని చన్వెల్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం ఖానాపూర్ గేటు సమీపంలో శ్రీనివాస కల్యాణ మండపంలో ఏర్పాటు చ ఏసిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి మూడు దఫాలుగా రైతుల అకౌంట్లలో రూ.6 వేలు క్రమం తప్పకుండా వేస్తోందని చెప్పారు. చన్వెల్లిలో ప్లోరీ కల్చర్ బాగుందని, ఇంత చిన్న గ్రామంలో దాదాపు వంద ఎకరాల్లో పూలు సాగుచేయడం గొప్ప విషయమన్నారు. పాలి హౌస్కు నాబార్ద్ ద్వారా 60 శాతం సబ్సిడీ వస్తోందని, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో అయితే 90 శాతం అందుతోందని చెప్పారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి అనేక లాభాలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
27 రకాల పంటలకు కేంద్రం ఎంఎస్పీ ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వానివేనని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రభాకర్ రెడ్డి, వైభవ్ రెడ్డి పాల్గొన్నారు.