- త్వరలోనే ప్లాస్టిక్ తొలగింపు
- ఈ సమస్యలపై మంత్రి లోకేశ్, టీటీడీ చైర్మన్‌కు ఇటీవల ఎంపీ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తిరుమలలో కాలినడక మార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వినతిని టీటీడీ పరిగణనలోకి తీసుకుంది. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే మార్గంలో డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని.. అలాగే, ఆ మార్గంలో ప్లాస్టిక్‌ను తొలగించాలని ఎంపీ ఇటీవల టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఆయన వినతి మేరకు అలిపిరి 7వ కిలోమీటర్ దగ్గర డిస్పెన్సరీని టీటీడీ ఏర్పాటు చేసింది. దీన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారం ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు కాకా వెంకటస్వామి అభిమాని, తిరుపతికి చెందిన దళిత నేత మల్లారపు మధు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ వినతిని టీటీడీ గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకొని డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తున్నదని శనివారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రికి, టీటీడీ చైర్మన్‌కు ఎంపీ వినతి..
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా అలిపిరి మార్గంలో డిస్పెన్సరీ లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అలాగే, ఆ మార్గంలో మెట్లపై పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉండటం చూశారు. వెంటనే ఫొటోలు, వీడియోలు తీసి ఏపీ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అలిపిరి మార్గంలో వెంటనే డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ తొలగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును నారా లోకేశ్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. డిస్పెన్సరీని ఆదివారం ఓపెన్ చేస్తుండగా, ప్లాస్టిక్‌ను కూడా తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని టీటీడీ చైర్మన్ ఆదేశించినట్టు సమాచారం. ప్రతి నెల మూడో వారం ‘క్లీన్ తిరుమల’ పేరుతో టీటీడీ ప్లాస్టిక్‌ను తొలగించేది. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగడం లేదు. దీన్ని మళ్లీ ప్రారంభించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు.
