- కీవ్‌పై మిస్సైల్స్ తో విరుచుకుపడిన రష్యా..
- ఒకరు మృతి..19 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ డ్రోన్, మిస్సైల్స్ దాడి చేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 10 గంటల పాటు సుమారు 500 డ్రోన్లు, 40 మిస్సైల్స్ తో కీవ్ సిటీపై విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. అనేక హై-రైజ్ అపార్ట్‌మెంట్ భవనాలు, కార్లు, ఇతర ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.
దాడి వల్ల ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడంతో కీవ్‌లో దాదాపు 2,600 రెసిడెన్షియల్ బిల్డింగు(సుమారు 10 లక్షల మంది)ల్లో హీటింగ్ సౌకర్యం లేకుండా పోయాయి. ఇప్పటికే ఉన్న రోలింగ్ బ్లాక్‌ఔట్‌లతో పాటు అత్యవసర విద్యుత్ కోతలు విధించడంతో నీటి సరఫరాకు కూడా అంతరాయం కలిగింది.
శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సమీపంలో ఉంటుండటంతో లక్షలాది మంది తీవ్ర చలితో ఇబ్బంది పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో భేటీకానున్నారు. ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు (ఈస్టర్న్ టైమ్) సమావేశమవనున్నారు.
రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికను భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ఈ ప్రణాళిక దాదాపు 90% సిద్ధమైందని జెలెన్‌స్కీ ఇటీవల తెలిపారు.ఈ భేటీకి ఒకరోజు ముందే కీవ్‌పై రష్యా భారీ డ్రోన్, మిస్సైల్ దాడికి పాల్పడింది. ఈ దాడిని ‘శాంతి చర్చలకు రష్యా స్పందన’ అని జెలెన్‌స్కీ అభివర్ణించారు.
