- 2030 నాటికి ప్రధాన స్టేషన్ల విస్తరణ
- పెరగనున్న రైళ్ల సంఖ్య, మౌలిక వసతులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దేశంలోని రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించే ప్రణాళికలో భాగంగా కొన్ని ప్రధాన నగరాల్లో డబుల్ ట్రెయిన్ కెపాసిటీని అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విశాలమైన టెర్మినల్స్ ఏర్పాటు, నెట్‌వర్క్ విస్తరణ చేపట్టనున్నారు. ఈ ప్రణాళికలో హైదరాబాద్నగరాన్ని కూడా డబుల్ట్రయిన్కెపాసిటీ స్టేషన్లుగా అభివృద్ధి చేసి, రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్ల గుండా రోజుకు 85 మెయిల్ ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ ట్రెయిన్లు ప్రయాణిస్తుండగా, కొత్త ప్రణాళికతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఇక ఎంఎంటీఎస్ ట్రెయిన్లు 88 రూట్లలో ప్రయాణిస్తున్నండగా, రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తారు. 2030 నాటికి ఈ డబ్లింగ్ పనులు పూర్తి చేయనున్నారు. అదనపు ప్లాట్ ఫారాలు, స్టేబ్లింగ్ లైన్స్, పిట్ లైన్స్ నిర్మిస్తారు. అర్బన్ ఏరియాల్లో కొత్త టెర్మినల్స్, మెయింటెనెన్స్ సౌకర్యాలు, మెగా కోచింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, కొత్త ట్రెయిన్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లను శాటిలైట్ టెర్మినల్స్‌గా అభివృద్ధి చేస్తున్నారు.చర్లపల్లి టెర్మినల్‌ను మరింత అప్ గ్రేడ్ చేసి అదనంగా 10 లైన్లు, 4 హైలెవెల్ ప్లాట్‌ఫారాలు, పిట్ లైన్స్ నిర్మిస్తారు. అలాగే సిటీ విస్తరణ దృష్ట్యా నార్త్, సౌత్, వెస్ట్ ప్రాంతాల్లో మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మాణం ప్రతిపాదించారు. హఫీజ్ పేట, హైటెక్ సిటీ, మలక్‌పేట, ఉప్పల్, మేడ్చల్, మల్కాజిగిరి వంటి సబర్బన్ స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా ఆధునీకరించాలని నిర్ణయించారు.
