జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నం : డాక్టర్ల అసోసియేషన్

జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నం : డాక్టర్ల అసోసియేషన్
  •     రాష్ట్ర గవర్నమెంట్ డాక్టర్ల సంఘం ఆవేదన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) వ్యవస్థలో లోపాల వల్ల డాక్టర్లకు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వైఫల్యానికి అధికారులే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) మండిపడింది. శనివారం హైదరాబాద్‌‌‌‌  కోఠి డీఎంఈ కార్యాలయం ముందు నిర్వహించిన ప్రెస్‌‌‌‌ మీట్‌‌‌‌లో అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  నరహరి, సెక్రటరీ జనరల్  డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్  మాట్లాడారు.

టీవీవీపీని డైరెక్టరేట్  ఆఫ్  సెకండరీ హెల్త్ (డీఎస్‌‌‌‌హెచ్) గా మార్చడమే సమస్యలకు శాశ్వత పరిష్కారమన్నారు. దీనిపై ఇప్పటికే ఏఎస్సీఐ కమిటీ సానుకూలంగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. హాస్పిటల్స్ లో అడ్మినిస్ట్రేటివ్  ఆఫీసర్లకు (ఏవో) ఇస్తున్న మితిమీరిన అధికారాల వల్ల డాక్టర్ల ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొత్తగా ఏర్పాటైన మెడికల్  కాలేజీల్లో ఫ్యాకల్టీ చేరాలంటే పెరిఫెరల్  మెడికల్  కాలేజ్ అలవెన్స్ మంజూరు చేయాలని సూచించారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు కెరీర్  అడ్వాన్స్‌‌‌‌మెంట్  స్కీమ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే నిమ్స్ పేస్కేల్స్‌‌‌‌ ను అమలు చేయాలని, రిక్రూట్‌‌‌‌మెంట్​కు ముందే  సరెండర్స్ పూర్తి చేయాలని డిమాండ్  చేశారు.