- గ్రామసభలు నిర్వహించాలి
- సర్పంచ్లకు ఇన్చార్జ్ మంత్రి జూపల్లి దిశానిర్దేశం
నిర్మల్, వెలుగు: కొత్త సర్పంచ్లు రాజకీయాన్ని పక్కనపెట్టి, ప్రజా సేవచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిర్మల్, ఖానాపూర్ లో జరిగిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. సర్పంచ్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారని, దాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉండాలని, అప్పుడే మంచి పేరు వస్తుందన్నారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా గ్రామసభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని, రానున్న రోజుల్లో మ రిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టబోతోందని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం
పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 1551 స్థానాల్లో పార్టీల వారీగా గెలుచుకున్న వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ 820 పంచాయతీల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 343, బీజేపీ 269 పంచాయతీల్లో తెలిచాయన్నారు. ఇకనుంచి తాను జిల్లాకు ఎక్కువ సమయం కేటాయిస్తానని, ప్రత్యేక దృష్టిసారించి ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా పర్యవేక్షిస్తానన్నారు.
పార్టీ కేడర్ కు, నాయకులకు అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన యాపలగూడ సర్పంచ్
నేరడిగొండ, వెలుగు: సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నేరడిగొండ మండలంలోని యాపలగూడ సర్పంచ్ మండాడి కృష్ణ బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆడె గజేందర్ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ లు ముందుండి పనిచేయా లని సూచించారు.
