తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 'ఫిల్మ్ ఛాంబర్' ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇవాళ ఆదివారం డిసెంబర్ 28న ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. విజేతలను ఇవాళే ప్రకటించడం గమనార్హం.
2025-2027 'సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.ప్రస్తుతం తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.
వీరిలో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా నాలుగు సెక్టార్లకు ఛైర్మన్‌లను, 44 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు.
ఈ ఎన్నికలలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులతో పాటు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్స్‌తో కూడిన నాలుగు విభాగాల కార్యనిర్వాహక సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. తెలుగు సినిమా భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకునే ఈ ఛాంబర్‌కు ఎవరు అధ్యక్షత వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డి.సురేష్ బాబు vs నట్టి కుమార్:
ఇన్నిరోజులు ప్రోగ్రెసివ్, మన ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిబంధనల ప్రకారం, ఈసారి అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు కేటాయించబడింది. దీంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి.సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
గత కమిటీ పదవీకాలం జులై 2025లోనే ముగియగా, ఆరు నెలల ఆలస్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనుభవం, నిబద్ధత కలగలిసిన తమ ప్యానెల్‌ను ఆదరించాలని ప్రోగ్రెసివ్ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తోందో చూడాలి మరి..
