- దేశ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలి: కిషన్ రెడ్డి
- సీబీసీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి
హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: దేశస్వాతంత్ర్యోద్యమంలో దేశభక్తి భావనను పెంపొందించిన నినాదం వందేమాతరం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ కోఠి వివేకవర్ధిని కాలేజీ ప్రాంగణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఫొటో ప్రదర్శనను కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
వందేమాతరం పవిత్ర గీతాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. 1938లో హైదరాబాద్ సంస్థానంలో వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిందని, గీతం ఆలపించిన విద్యార్థులను కాలేజీలు, యూనివర్సిటీల నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వివిధ సామాజిక, జాతీయ సంస్థలు రాజకీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాటం చేసిన చరిత్ర హైదరాబాద్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ తరతరాలుగా వందేమాతరం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, వివేకవర్ధిని కాలేజీ ప్రిన్సిపాల్ డి.విద్యాధర్, జాయింట్ సెక్రటరీ వి.నాగేశ్ రావు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, సీబీసీ, పీఐబీ అధికారులు పాల్గొన్నారు. కాగా.. వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రజలు తలదించుకునేలా కామెంట్లు చేస్తున్నరు
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, దూషణలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు తలదించుకునేలా కామెంట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ కాచిగూడలో స్థానిక కార్పొరేటర్ కన్నె ఉమారమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ 101వ జయంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
వాజపేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ హితం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు వాజ్‌పేయీ అని కొనియాడారు. దేశ భద్రతకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలు వినాలని సూచించారు.
