బాగ్‌పత్: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా ఖాప్ పంచాయతీ సమావేశంలో టీనేజర్లు స్మార్ట్‌ఫోన్లు వాడడాన్ని.. అబ్బాయిలు, -అమ్మాయిలు హాఫ్ ప్యాంట్స్ (షార్ట్స్) ధరించడంపై నిషేధం విధించారు. సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఖాప్ పెద్దలు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాలలో 18- నుంచి 20 ఏండ్లలోపు టీనేజర్లకు స్మార్ట్‌ఫోన్లు నిషేధించారు. అయితే, స్కూల్‌లో విద్యా ప్రయోజనాలకు మినహాయింపు ఇచ్చారు. కానీ, ఇంట్లో మాత్రం నియంత్రణను తప్పనిసరి చేశారు. అలాగే, అబ్బాయిలు, అమ్మాయిలు హాఫ్ ప్యాంట్స్ ధరించడంపై పూర్తి నిషేధం విధించారు.
పెండ్లిళ్లు మ్యారేజ్ హాళ్లలో కాకుండా గ్రామాల్లో, ఇండ్లలోనే జరపాలని నిర్ణయించారు. అతిథుల జాబితాను కూడా పరిమితం చేశారు. అతిగా ఖర్చు చేయడాన్ని నిషేధించారు. ఫిజికల్ ఇన్విటేషన్ కార్డులకు బదులుగా వాట్సాప్ లో ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు ఖాప్పెద్దలు ఈ నిర్ణయాన్ని సమాజ హితం కోసం ఉత్తరప్రదేశ్ అంతటా అమలు చేస్తామని, ఇతర ఖాప్‌లను సంప్రదించి రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు కూడా మాట్లాడుతూ.. తాము ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
