- భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారం ఇచ్చింది
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ఫార్మా సిటీ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ నష్టపరిహారం ఇచ్చిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నష్టపరిహారం, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు అందిస్తోందని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో 13 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించే టైంలో తాను కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చానని గుర్తుచేశారు.
ఈ భూములు విషతుల్యమవుతాయని, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేసినట్లు వివరించారు.
అయినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా తక్కువ పరిహారం ఇవ్వడంతో రైతులు పోరాటం చేశారని, ఆ పోరాటాల ఫలితంగా రూ.7 లక్షలు, రూ.12 లక్షలు, రూ.16 లక్షల చొప్పున పరిహారం లభించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఆ భూములను తన బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.
అడ్డగోలు ఆరోపణలు వద్దు
అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని ఎత్తేస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించినట్లు కోదండరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు రైతుల ప్రయోజనాలకు తగ్గట్టు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించామని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు అడ్డగోలు ఆరోపణలు చేయకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోదండరెడ్డి సూచించారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే కలిసి చర్చించాలని, అడ్డగోలు మాటలతో ప్రజల్లో చులకన కావద్దని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
