‘కాకా మెమోరియల్’ క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన ఆదిలాబాద్

‘కాకా మెమోరియల్’ క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన ఆదిలాబాద్
  • ఉమ్మడి జిల్లా టోర్నీ ఫైనల్స్​లో మంచిర్యాలపై గెలుపు

కోల్​బెల్ట్, వెలుగు: కాకా మెమోరియల్​ క్రికెట్​ టోర్నీ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా విన్నర్​గా ఆదిలాబాద్​ జట్టు నిలిచింది. మంచిర్యాల జిల్లా గుడిపేట 13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్​లో విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్​సీఏ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా టీ20 ఫేజ్-1 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా ఫైనల్స్​లో ఆదిలాబాద్​ జిల్లా టీం, మంచిర్యాల టీంపై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్​గెలిచిన ఆదిలాబాద్ టీం మొదట బ్యాటింగ్​కు దిగింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మహమ్మద్​అస్పాన్​ 47 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్​లతో 68 పరుగులు చేశాడు. సాయిచరణ్​ 22 పరుగులు చేశాడు.

మంచిర్యాల జిల్లా జట్టుకు చెందిన బౌలర్లు గణేశ్, ఇస్మాయిల్​అహ్మద్, సందీప్​ చేరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్​దిగిన మంచిర్యాల జట్టు క్రీడాకారులు టార్గెట్​ చేధించలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 13.2 ఓవర్లలో అలౌట్​ అయ్యి 60 పరుగులు మాత్రమే చేశారు. ముగ్గురు డకౌట్​కాగా నలుగురు కేవలం 8 లోపు పరుగులు చేయడంతో మంచిర్యాల జట్టుకు ఓటమి తప్పలేదు. 70 పరుగుల తేడాతో మెమోరియల్​టీ20 క్రికెట్​ టోర్నీ ఫేజ్ 1 విన్నర్​గా ఆదిలాబాద్​ జట్టు నిలిచింది. జట్టుకు చెందిన బౌలర్​రాజబాబు నాలుగు ఓవర్లు వేసి తొమ్మిది రన్స్​ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో మ్యాన్​ఆఫ్​ది మ్యాచ్​ దక్కించుకున్నాడు.

ఆటలకు కాకా ఫ్యామిలీ ప్రోత్సాహం..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సాహించడంలో కాకా వెంకటస్వామి కుటుంబం ఎన్నో ఏండ్లుగా ముందుంటోందని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్స్​అసోసియేషన్​ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్​రెడ్డి అన్నారు. ఫైనల్​ పోటీల్లో గెలిచిన జట్టు ప్లేయర్లకు ఆయన బెటాలియన్​ అసిస్టెంట్​ కమాండెంట్​ కాళీదాస్​తో కలిసి బహుమతులు అందజేశారు. క్రికెట్​ లీగ్​ నిర్వహణలో 13 బెటాలియన్ కమాండెంట్,​ ఆఫీసర్లు, సిబ్బంది, హెచ్​సీఏ భాగస్వాములయ్యారు.

కాకా మెమోరియల్​ ట్రస్ట్, విశాక ఇండస్ర్టీస్​ లిమిటెడ్ అధినేత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అతిథులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆదిలాబాద్​ జట్టుకు విన్నర్, మంచిర్యాల జట్టుకు రన్నరప్​​ ట్రోఫీలను అందించారు.

మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్ ​దక్కించుకున్న క్రీడాకారులకు రూ.2 వేల చొప్పున క్యాష్​ ప్రైజ్​లు అందజేశారు. కార్యక్రమంలో హెచ్​సీఏ జిల్లా కోచ్​ పొరండ్ల ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్​ జిల్లా ప్రెసిడెంట్​ హఫీజ్, నాయకుడు నల్ల రవి, సీనియర్​ క్రీడాకారులు చందు, శ్రీనివాస్​, బెటాలియన్​ ఆర్​ఎస్​ఐలు మహేశ్, కార్తీక్​ తదితరులు పాల్గొన్నారు.