టోక్యో: జపాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా 67 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దేశంలో ఇయర్ ఎండ్ సెలవులు ప్రారంభమైన సమయంలో ఈ ఘటన జరిగింది. టోక్యోకు 160కి.మీ దూరంలో ఉన్న మినాకామి పట్టణంలోని కాన్ ఎత్సు ఎక్స్ ప్రెస్ వేపై శుక్రవారం రాత్రి రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. దీంతో ఎక్స్ ప్రెస్ వే బ్లాక్ అయింది. రోడ్డుపై పేరుకుపోయిన మంచు కారణంగా వాటి వెనుక వచ్చిన వాహనాలకు బ్రేక్ పడలేదు. ఫలితంగా 67 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలోనే 20 వాహనాలకు అంటుకున్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన 26 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. శిథిలాలను తొలగించడానికి ఎక్స్ ప్రెస్ వేలోని కొన్ని భాగాలను పోలీసులు మూసేశారు.
