ఈ ఏడాది భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో సిప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డ్ స్థాయికి చేరాయి. నవంబర్ నాటికి సిప్ ఇన్‌ఫ్లోలు రూ.3.04 లక్షల కోట్లు దాటాయి. ఇది 2024 మొత్తంలో సిప్‌ల ద్వారా వచ్చిన రూ.2.69 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో సిప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డ్ స్థాయికి చేరాయి. నవంబర్ నాటికి సిప్ ఇన్‌ఫ్లోలు రూ.3.04 లక్షల కోట్లు దాటాయి. ఇది 2024 మొత్తంలో సిప్‌ల ద్వారా వచ్చిన రూ.2.69 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువ. మార్కెట్ అస్థిరత మధ్య పెట్టుబడిదారులు లంప్‌సమ్ (ఒకేసారి పెట్టే మొత్తం) పెట్టుబడులను తగ్గించి, క్రమబద్ధమైన సిప్‌లకు మొగ్గు చూపారు.
అక్టోబర్ 2025 వరకు యాక్టివ్ ఈక్విటీ స్కీముల్లో లంప్‌సమ్ పెట్టుబడులు రూ.3.9 లక్షల కోట్లు కాగా, గత సంవత్సరం రూ.5.9 లక్షల కోట్లు ఉన్నాయి. సిప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడులు 3శాతం పెరిగి రూ.2.3 లక్షల కోట్లకు చేరాయి. మొదటి 10 నెలల్లో సిప్‌లు యాక్టివ్ ఈక్విటీ స్కీముల్లో 37శాతం వాటా కలిగి ఉండగా, 2024లో ఇది 27శాతం మాత్రమే.
ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్లు రూ.29,529 కోట్లు కాగా, నవంబర్‌లో రూ.29,445 కోట్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) కూడా రూ.80.80 లక్షల కోట్లకు పెరిగింది. లిక్విడిటీ, రిటైల్ సిప్‌లు పెరుగుతుండడం, ఆర్థిక వృద్ధి ఆశలు వంటివి పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
