టికెట్ రాని లీడర్లు నామినేషన్లు వాపస్ తీసుకోవాలి..బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు వార్నింగ్

టికెట్ రాని లీడర్లు నామినేషన్లు వాపస్ తీసుకోవాలి..బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు వార్నింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ గీత దాటేవారిపై కఠిన చర్యలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. టికెట్ దక్కని వారు.. రెబల్స్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్లు వేసిన లీడర్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకుంటే అధిష్టానం ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని తెలిపారు. 

‘‘పార్టీ అభ్యర్థులందరిని సంప్రదించాం. గెలిచే అవకాశం ఉన్న వారికి సమష్టి నిర్ణయంతో టికెట్లు కేటాయించి, బీఫామ్​ లు ఇచ్చాం. టికెట్లు పొందని కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. రెబల్స్‌‌‌‌‌‌‌‌గా మారి, వేరే పార్టీల నుంచి గానీ, ఇండిపెండెంట్లుగా గానీ పోటీ చేస్తే పార్టీ నియమావళిని ఉల్లగించడమేనని పేర్కొన్నారు. బీఫామ్ పొందని వాళ్లు వెంటనే నామినేషన్లు విత్ డ్రా చేసుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడంతో పాటు మెజార్టీ స్థానాలను గెలవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.