హరీశ్ ఫోన్​ను ట్యాప్ చేయించారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హరీశ్ ఫోన్​ను ట్యాప్ చేయించారు:  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  •     కేసీఆర్​పై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ
  •     సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: హరీశ్ రావు ఫోన్​ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీలో జరిగిన నాయకత్వ మార్పు రచ్చలో భాగంగానే ఇలా చేయించారని అన్నారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించేందుకు వంటేరు ప్రతాప్ రెడ్డి, హరీశ్ రావు మధ్య జరిగిన సంభాషణ మొత్తం కేసీఆర్ విన్నారని తెలిపారు. అందుకే హరీశ్ రావును పిలిచి మందలించారని, తర్వాత ప్రతాప్ రెడ్డిని బీఆర్ఎస్​లోకి లాక్కున్నారని చెప్పారు. 

హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారనడానికి ఇదే పెద్ద ఆధారమని అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ‘‘జడ్జిలు, టాలీవుడ్ ప్రముఖులు, జర్నలిస్ట్​ల ఫోన్ల ట్యాంపింగ్​పై సీబీఐతో విచారణ జరిపించాలి. త్వరలోనే అమిత్​షాను కలిసి ట్యాపింగ్ అంశంపై జోక్యం చేసుకోవాలని వినతిపత్రం అందజేస్తాం. పోలీసులు ఆధారాలను ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’’అని అన్నారు. అవతరణ దినోత్సవానికి సోనియాని పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలన్నారు.