యూపీ ఎన్నికల్లో రెండు పార్టీలతో బీజేపీ పొత్తు

యూపీ ఎన్నికల్లో రెండు పార్టీలతో బీజేపీ పొత్తు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రయత్నాలు షురూ చేశారు. ఆకర్ష్ ఆపరేషన్లు, పొత్తులు, ఎత్తులతో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి  ఏడు దశల్లో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో పార్టీలు తమ శక్తులను కూడగట్టుకుంటున్నాయి. ఇవాళ తాజాగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ పొత్తులపై ప్రకటన చేశారు. రెండు చిన్న పార్టీలతో కలసి ఎన్డీయే కూటమిని ప్రకటించారు. అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు  తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 403 సీట్లలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని నడ్డా వెల్లడించారు. లోతుగా చర్చలు జరిగిన తర్వాతనే పొత్తులు ఖరారు చేసుకున్నట్లు చెప్పారు. యూపీలో మరోసారి గెలుపు తమదేనని, అభివృద్ధికే ప్రజలు ఓటేస్తారని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ఏయే పార్టీకి ఎన్నెన్ని సీట్లను కేటాయించనున్నది ప్రకటించలేదు. 2017లోనూ యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగ్గా.. 403 సీట్లకు గానూ 312 చోట్ల ఎన్డీయే కూటమి విజయం సాధించింది.

మా చర్చలు.. సీట్ల కోసం కాదు గెలుపు కోసం

అభివృద్ది, సామాజిక న్యాయం.. సమ్మిళితమైన కూటమి తమదన్న విషయం రుజువైందని అప్నా దళ్  నేత అనుప్రియా పటేల్ అన్నారు. మొత్తం 403 సీట్లలో తమ కూటమి పోటీ చేస్తుందని నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ చెప్పారు. ఎటువంటి అరమరికలు లేకుండా తమ కూటమిలోని పార్టీల మధ్య చర్చలు జరిగాయని, తమ చర్చలు విజయం కోసమే తప్ప సీట్ల కోసం కాదని ఆయన తెలిపారు. 

కాగా, ఇప్పటికే బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి దశ పోలింగ్ జరిగే 58 సీట్లలో 57 చోట్ల అభ్యర్థులను, రెండో దశకు సంబంధించిన 55 సీట్లకు గాను ఇప్పటి వరకు 48 మంది పేర్లను విడుదల చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్ పూర్ నుంచి, సిరాతు నుంచి డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం..

ఫీజుల పెంపు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

కేసీఆర్ను టచ్ చేసేవాడు ప్రపంచంలోనే లేడు

జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. బయటకు తీసిన డాక్టర్లు!