జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. నోటి ద్వారానే బయటకు తీసిన డాక్టర్లు!

జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. నోటి ద్వారానే బయటకు తీసిన డాక్టర్లు!

న్యూఢిల్లీ: జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే అలా జైలులో ఫోన్ వాడుతున్న ఓ ఖైదీ చేసిన వింత పని గురించి తెలిస్తే షాక్ అవుతారేమో!! ఢిల్లీలోని తీహార్ జైలులో ఓ ఖైదీ ఫోన్ వాడుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అధికారులు చెకింగ్‌ చేయడంతో వాళ్లకు దొరక్కుండా ఉండాలని దానిని అతి కష్టం మీద మింగేశాడతను. అప్పటికి తప్పించుకోగలిగినా.. ఆ ఖైదీకి తర్వాత తిప్పలు తప్పలేదు.

పూర్తిగా మింగకుండా గొంతులోనే ఆపేసి.. అధికారులు వెళ్లిపోయాక ఫోన్ బయటకు తీసి మళ్లీ వాడుకుందామనుకున్న ఖైదీకి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆ ఫోన్ జారి కడుపులోకి వెళ్లిపోయింది. దీంతో అప్పటికి అధికారుల నుంచి తప్పించుకున్నా.. ఆ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో అడ్డంపడ్డాడు. దీంతో జైలు అధికారులు ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ఖైదీ పొట్ట ఎక్స్‌ రే చేయగా.. లోపల ఫోన్ ఉన్నట్టు గుర్తించామని డాక్టర్ సిద్ధార్థ్ నేతృత్వంలోని టీమ్ తెలిపింది. ఎండోస్కోపీ సర్జరీ చేసి.. ఫోన్‌ను చిన్నపాటి వల సాయంతో పైకి లాగి నోటి ద్వారా బయటకు తీశామని డాక్టర్లు చెప్పారు. ఆ ఫోన్ ఏడు సెంటీ మీటర్ల పొడవు, మూడు సెంటీ మీటర్ల వెడల్పు ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్‌ను మింగడం చాలా కష్టమని, అయితే జైలులో కొంత మంది ఖైదీలకు ఇది అలవాటేనని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.  అలా మింగిన ఫోన్లను చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి ఉంటుందని, తాను ఇప్పటి వరకు ఇలాంటివి పది ఫోన్లు బయటకు తీశానని వివరించారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనా టెస్టులపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

ఇప్పట్లో కరోనాకు అంతం లేనట్లే

కరోనా టెన్షన్: ఫిబ్రవరి 13వరకు కఠిన ఆంక్షలు