డిగ్రీలో ఏవియేషన్, డిఫెన్స్ కోర్సులు.. మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త సబ్జెక్టులు

డిగ్రీలో ఏవియేషన్, డిఫెన్స్ కోర్సులు.. మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త సబ్జెక్టులు
  • వచ్చే ఏడాది దోస్త్ లో11 కొత్త కోర్సులు ఎంట్రీ 
  • జాబ్ ఓరియెంటెడ్ కోర్సులకు టీజీసీహెచ్ఈ ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఇకపై జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకున్న ట్రెడిషనల్ కోర్సులతో పాటు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఏవియేషన్,  డిఫెన్స్,  ఫిన్ టెక్ వంటి విభాగాల్లో సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) నిర్ణయించింది. వచ్చే 2026– -27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అమలులోకి రానున్నాయి.

స్టేట్​లోని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నారు. బకెట్ సిస్టమ్ రావడంతో వందలాది సబ్జెక్టులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త కోర్సులను తీసుకొస్తూనే, అడ్మిషన్లు లేని కోర్సులనూ ఎత్తేసేందుకు టీజీసీహెచ్ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిగ్రీలో 11 కొత్త కోర్సులు, పీజీలో రెండు కోర్సులను తీసుకురానున్నది. ముఖ్యంగా ఏవియేషన్, డిఫెన్స్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా వీటిని రూపొందించారు. 

కొత్త కోర్సులు ఇవే.. 

ఏవియేషన్ లో బీబీఏ ఎయిర్‌‌‌‌పోర్ట్, ఎయిర్‌‌‌‌లైన్స్, ఎయిర్‌‌‌‌స్పేస్ మేనేజ్‌‌‌‌మెంట్ కోర్సుతో పాటు పీజీ స్థాయిలో ఎంఏ ఏవియేషన్ మేనేజ్‌‌‌‌మెంట్ అందుబాటులోకి రానుంది. మరోపక్క డిఫెన్స్ లో బీఏ డిఫెన్స్, సెక్యూరిటీ, పొలిటికల్ సైన్స్,  ఎంఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కామర్స్ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ కేటగిరీలో బీకామ్ ఫిన్ టెక్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ - ఫైనాన్స్ - అకౌంట్స్,  బీకామ్ ఇ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు రానున్నాయి.

వీటితో పాటు బీబీఏ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ అండ్ స్టార్టప్ మేనేజ్‌‌‌‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్‌‌‌‌కేర్ మేనేజ్‌‌‌‌మెంట్, బీఎస్సీ మల్టీమీడియా డిజైన్ అండ్ యానిమేషన్, బీఎస్సీ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, బీబీఏ రూరల్ మేనేజ్‌‌‌‌మెంట్ వంటి కోర్సులకు పర్మిషన్ ఇచ్చారు. 

కొత్త కోర్సులకు నోటిఫికేషన్ విడుదల 

రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో కొత్త యూజీ, పీజీ కోర్సుల మంజూరు, కోర్సుల మార్పులు, మీడియం మార్పులకు సంబంధించి టీజీసీహెచ్‌‌‌‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026–-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు టీజీసీహెచ్ఈ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. కాలేజీలు మార్చి 9వ తేదీ వరకు వెబ్‌‌‌‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, మార్చి 10కల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు.