చెన్నై: బ్యాటింగ్‌లో చెలరేగిన అఫ్గానిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌ను విజయంతో ముగించింది. ఇబ్రహీం జద్రాన్ (56 బాల్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95 నాటౌట్), సెదిఖుల్లా అటల్ (32 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) దుమ్మురేపడంతో.. గురువారం జరిగిన గ్రూప్–డి లీగ్ మ్యాచ్‌లో అఫ్గాన్ 82 రన్స్ తేడాతో కెనడాపై గెలిచింది. టాస్ ఓడిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 200/4 స్కోరు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్ (30), ఇబ్రహీం తొలి వికెట్‌కు 47 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ ఆరో ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో గుర్బాజ్, గుల్బాదిన్ నైబ్ (1) ఔటయ్యారు. ఇబ్రహీంతో కలిసి సెదిఖుల్లా అద్భుతంగా ఆడాడు.
వీరిద్దరు భారీ షాట్లతో కెనడా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 33 బాల్స్‌లో ఇబ్రహీం హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 95 రన్స్ జత చేసి సెదిఖుల్లా వెనుదిరిగినా.. ఇబ్రహీం చివరి వరకు క్రీజులో నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (13), డార్విష్ రసోలీ (4 నాటౌట్) అండతో భారీ స్కోరు అందించాడు. జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కెనడా 20 ఓవర్లలో 118/8 స్కోరుకే పరిమితమైంది. హర్ష్ ఠాకూర్ (30) టాప్ స్కోరర్. సాద్ బిన్ జాఫర్ (28), యువరాజ్ సమ్రా (17) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మహ్మద్ నబీ 4, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. ఇబ్రహీంకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
