ఈడీ ఎంట్రీతో మిల్లర్లలో గుబులు

ఈడీ ఎంట్రీతో మిల్లర్లలో గుబులు
  • కోదాడలో సీఎంఆర్ అక్రమాలపై దర్యాప్తు 
  • పలువురు మిల్లర్లపై తాజాగా కేసులు 
  • రెండు మిల్లులు సీజ్

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ పేరిట రూ.వేల కోట్లు దండుకున్న మిల్లర్లకు ఈడీ ఎంట్రీతో గుబులు పట్టుకుంది. ఇటీవల కోదాడలోని శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లులో విచారణ చేపట్టగా.. గతంలో  ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రైస్​ను విదేశాలకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తులు జప్తు కాకుండా, కేసుల నుంచి తప్పించుకునేందుకు కోర్టుకెళ్లి దర్జాగా బయట  తిరుగుతున్నారు. అయితే, కోదాడలో ఈడీ దర్యాప్తు చేపడుతుండటంతో మొత్తం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం మాయంపైనా దర్యాప్తు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.  

మిల్లు పేరిట లోన్.. పక్కదారి

కోదాడకు చెందిన వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ యజమాని మిల్లు కోసం హైదరాబాద్ కు చెందిన ఓ జాతీయ బ్యాంక్ లో రూ.100 కోట్ల లోన్ తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని మిల్లు నిర్మాణం కోసం కాకుండా ఇతర అవసరాలకు పక్కదారి పట్టించాడు. దాదాపు రూ.120 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం డబ్బులను కిట్స్​ కాలేజీ నిర్వహణ, ఇతరాలకు మళ్లించాడని, ఇందుకు ట్యాక్స్ కూడా చెల్లించలేదని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల ఈడీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. 

విదేశాలకు తరలింపు!

బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లాలోని రైస్ మిల్లర్లు సీఎంఆర్ ను ప్రభుత్వానికి అప్పగించకుండా విదేశాలకు తరలించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు రూ.600 కోట్ల విలువైన వడ్లు మిల్లుల నుంచి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిల్లర్ల నుంచి రికవరీకి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటోంది. అయితే, సూర్యాపేట జిల్లాలోని కొంతమంది మిల్లర్లు ఆర్ఆర్ యాక్ట్ తమపై ప్రయోగించకుండా హైకోర్టుకు వెళ్లడంతో అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. 

డీఫాల్ట్ మిల్లుల నుంచి..

సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మిడి సోమ నర్సయ్య హయాంలో మిల్లర్లు భారీగా సీఎంఆర్ ధాన్యం మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. డీఫాల్ట్ మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి సిఫారసు లెటర్ ఇవ్వాలన్న నిబంధన ఉండగా.. రూల్స్ పేరుతో డీఫాల్ట్ మిల్లుల నుంచి బలవంతంగా తన మిల్లులకు సీఎంఆర్ ధాన్యాన్ని తరలించారన్న చర్చ జరిగింది. గరిడేపల్లికి చెందిన ఓ డీఫాల్ట్ మిల్లర్ రూ.60 కోట్ల విలువైన వడ్లను సోమ నర్సయ్య మిల్లుకు తరలించారు. ప్రభుత్వానికి బకాయి పడటంతో రైతుల నుంచి కొనుగోలు చేసి సీఎంఆర్ ధాన్యం కింద అప్పగించారు. 

సదరు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. గతంలో మిల్లుకు కేటాయించిన సీఎంఆర్​వడ్లను మిల్లర్​అమ్ముకునే ప్రయత్నం చేస్తుండగా అధికారులు పట్టుకొని, మిల్లును సీజ్​చేశారు. మిల్లర్​పై కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ లో ఓ మిల్లర్  రూ.10 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని సోమ నర్సయ్య మిల్లుకు పెట్టాడు. ప్రభుత్వానికి సీఎంఆర్​ బకాయి పడటంతో మిల్లర్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనపై దర్యాప్తు చేయనున్నారని తెలిసింది. ఆయన కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు  ఆందోళన చెందుతున్నారు.