- ప్రజల సంక్షేమమే ఏఐకి బెంచ్‌మార్క్ అవ్వాలి
- డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ హానిని అరికట్టేందుకు గ్లోబల్ స్టాండర్డ్స్ అవసరమని వ్యాఖ్య
- ఏఐ అభివృద్ధికి ‘మానవ్ విజన్’ ప్రకటన
- మోదీతో పర్మెలిన్ భేటీ.. ఏఐ సహకారం, ట్రేడ్ లింకేజీలపై చర్చ
- 2027 ఏఐ ఇంపాక్ట్ సమిట్ జెనీవాలో: పర్మెలిన్
న్యూఢిల్లీ:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని జవాబుదారీతనంతో పనిచేసేలా, మానవ కేంద్రీకృతంగా అభివృద్ధి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏఐకి ఓపెన్ స్కై ఇవ్వాలని.. అయితే, దాని నియంత్రణ మాత్రం మానవుల చేతుల్లోనే ఉండాలని చెప్పారు. తెలివైన యంత్రాల తయారీకి ఏఐని పరిమితం చేయకుండా, మానవ సామర్థ్యాలను పెంచే సాధనంగా మార్చాలని సూచించారు.
ఢిల్లీలో జరుగుతోన్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో ప్రధాని మోదీ గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ వినియోగంలో ‘మానవ్ (ఎంఏఎన్ఏవీ) విజన్’ ను ప్రకటించారు. మనల్ని ఏఐ కంట్రోల్ చేయకూడదని.. మనమే ఏఐని శాసించాలని స్పష్టం చేశారు. మానవ్ విజన్ అర్థం, ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన వివరించారు.
‘మానవ్ విజన్’ అర్థం ఏమిటంటే..
‘మానవ్ విజన్’లో 'ఎం' అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్ అని మోదీ తెలిపారు. ఏఐ అభివృద్ధి నైతిక విలువలు, మానవ హక్కులు, బాధ్యతల ఆధారంగా ఉండాలని చెప్పారు. 'ఏ' అంటే అకౌంటబుల్ గవర్నెన్స్ అని.. ఏఐ వ్యవస్థలు పారదర్శక నియమాలు, బలమైన పర్యవేక్షణ, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. 'ఎన్' అంటే- నేషనల్ సావర్నిటీ అని.. ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికి మాత్రమే చెందాలని, ఆ దేశ పరిధిలోనే ఉండాలని తెలిపారు.
ఎవరి డేటా వారిదేననే అనే సూత్రాన్ని ఏఐ పాటించాలని వివరించారు.' ఏ' అంటే- యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ అని తెలిపిన మోదీ.. ఏఐపై ఒక్కటి, రెండు దేశాలు లేదా ఒక్కటి, రెండు బంగారు కంపెనీల పెత్తనం ఉండకూడదని..అన్నివర్గాల వారికీ అందుబాటులోకి రావాలన్నారు. 'వీ' అంటే- వేలిడ్ అండ్ లెజిటిమేట్ అని.. డీప్‌ఫేక్‌లు, ఫేక్ కంటెంట్‌ను నివారించడానికి ఏఐ సిస్టమ్‌లు చట్టబద్ధంగా, నిజాయితీగా, వెరిఫై చేయదగినవిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని మోదీ వెల్లడించారు. ఏఐని డెమోక్రటైజ్ చేయాలన్న ప్రధాని.. దాన్ని గ్లోబల్ సౌత్‌కు శక్తిమంతమైన సాధనంగా మార్చాలన్నారు.
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ హానిని అరికట్టేందుకు గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి వైపు నడిచే శకంలో ప్రస్తుతం మనం ఉన్నామని.. ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి బెంచ్‌మార్క్‌లవ్వాలని సూచించారు. ఒకప్పుడు దశాబ్దాలు పట్టిన సాంకేతిక ప్రభావాలు ఇప్పుడు చాలా వేగంగా విస్తరిస్తాయని మోదీ పేర్కొన్నారు. గురువారం జరిగిన సమిట్ లో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివాతో సహా ప్రపంచ నేతలు పాల్గొన్నారు.
మోదీతో స్విస్ అధ్యక్షుడు పర్మెలిన్ భేటీ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏఐ ఇన్నోవేషన్‌లో సహకారం, ఎథికల్ ఏఐ గవర్నెన్స్, మల్టిలాటరల్ సహకారం, ఇండియా- ఈఎఫ్‌టీఏ ట్రేడ్ అగ్రిమెంట్ (2024) తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత భాగస్వామ్యాలు, విద్య, టెక్నాలజీ, టాలెంట్ మొబిలిటీలో లింకేజీలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
సమావేశం అనంతరం స్విట్జర్లాండ్ అధ్యక్షుడు పర్మెలిన్ మాట్లాడుతూ..2027 ఏఐ ఇంపాక్ట్ సమిట్ జెనీవాలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. “ఏఐ గవర్నెన్స్‌ను చిన్న దేశాలు ఐకమత్యంగా బలపరచాలి. ఏఐ కొద్దిమంది బిగ్ పవర్ల చేతుల్లో మాత్రమే ఉండకూడదు” అని పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఇండియా, స్విట్జర్లాండ్ సంబంధాల్లో కొత్త అధ్యాయనాన్ని మొదలుపెట్టిందని రెండు దేశాలు వ్యాఖ్యానించాయి.
