- గత మార్చిలో ప్రారంభమైన పూడికతీత
- భారీ వర్షాలు, వరదలతో ఆగిన వర్క్స్
- వానలు తగ్గి నాలుగు నెలలైనా పనులు మొదలుకాని వైనం
- చెరువు పనులకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో టెంపుల్ టూరిజానికి కేరాఫ్‌గా ఉండే భద్రకాళి చెరువు సుందరీకరణ పనులు అటకెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ మధ్యలోని భద్రకాళీ చెరువులో పూడికతీత చేపట్టి, చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని టూరిజం స్పాట్‍గా అభివృద్ధి చేసేలా అడుగులు వేసింది. చెరువు మధ్యలో ఐలాండ్స్, బోటింగ్ ప్లాన్ చేసింది. నీటి పైభాగంలో అద్దాల వంతెన నిర్మించి భద్రకాళి చెరువు రూపురేఖలు మార్చేందుకు డీపీఆర్ రూపొందించి దాదాపు రూ.75 కోట్లతో పనులు ప్రారంభించింది.
గతేడాది జూన్ వరకే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావించినా భారీ వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. వానాకాలం పూర్తయ్యాక పనులు షురూ చేస్తామని చెప్పి నాలుగు నెలలు కావస్తున్నా వర్క్స్ స్టార్ట్ చేయడం లేదు.
382 ఎకరాల చెరువు పూడికతీతకు శ్రీకారం
భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా 2024 నవంబర్‍లో పనిలోపనిగా భద్రకాళి చెరువు సుందరీకరణ చేపట్టాలని భావించారు. మొదటి దశలో దాదాపు 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులోని చెత్తాచెదారాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆపై చెరువులో దాదాపు 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేలా లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది వానాకాలం నాటికి పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. పూడికతీత చేపట్టే క్రమంలో చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (ఎంసీఎఫ్టీలు) నీటిని బయటకు వదిలారు. ఈ క్రమంలో బురదమట్టి పూర్తిగా ఆరడానికి టైం పట్టింది. ఆపై చెరువులోని 5,85,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించడానికి రూ.11.16 కోట్ల టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు మొదలుపెట్టేసరికి మార్చి వచ్చింది.
రూ.75 కోట్లతో ఐలాండ్, గ్లాస్ బ్రిడ్జి..
భద్రకాళి చెరువులో పూడికతీత పనులు పూర్తవగానే రూ.75 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. నీటి మధ్యలో 9 ఐలాండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఓవైపు పూడికతీత జరుగుతుండగానే మరోవైపు ఐలాండ్ కోసం చెరువు మధ్యలో కట్టలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు భద్రకాళి చెరువులో బోటు షికారు చేస్తూ ఐలాండ్ల వద్దకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. నీటిపై భాగంలో అద్దాల వంతెన ఏర్పాటు చేసి ఐలాండ్ వద్దకు చేరుకునేలా సుందరీకరణ పనులకు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారు.
సమ్మర్ సరైన సమయం..
వరదల కారణంగా భద్రకాళి చెరువు పూడికితీత, సుందరీకరణ పనులు ఆగిన నేపథ్యంలో అధికారులు వానాకాలం ముగిశాక పనులను మళ్లీ చేపడతామన్నారు. అక్టోబర్ నాటికే రెయినీ సీజన్ ముగిసినా ఆఫీసర్లు చెప్పినమాట ప్రకారం గడిచిన నాలుగు నెలలుగా ఎక్కడా పెద్దగా పనులు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. దీంతో భద్రకాళి చెరువు ఏరియా మొత్తం ప్రస్తుతం గుర్రపు డెక్కతో మళ్లీ పచ్చగా మారింది. ఈ క్రమంలో భద్రకాళి బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపట్టేందుకు ప్రస్తుతం ఎండాకాలంలో నాలుగైదు నెలలు అనువుగా ఉండనుంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి అధికారులను పరుగులు పెట్టిస్తేనే గ్రేటర్ వరంగల్ టూరిజం డ్రీమ్ ప్రాజెక్ట్ సాకారం అవనుంది.
వానలు, వరదలతో పనులు డీలే..
భద్రకాళి చెరువు బ్యూటిఫికేషన్ పనులు గత మార్చి రెండో వారంలో మొదలవగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, గ్రేటర్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, నాయిని రాజేందర్‍రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. 382 ఎకరాల విస్తీర్ణంలో రాత్రిపగలనే తేడా లేకుండా పెద్దఎత్తున లారీలు, టిప్పర్లతో పూడికతీత పనులు జెట్ స్పీడ్‌తో నడిపించారు. జులై నాటికి దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యే సమయానికి నగరంలో ఒక్కసారిగా భారీ వర్షాలు మొదలయ్యాయి. బంక మట్టిలో వాహనాలు కదల్లేకపోవడానికి తోడు అప్పటికే తీసిన మీటర్ లోతు చెరువులోకి వరద రావడంతో బ్యూటిఫికేషన్ పనులు అర్థాంతరంగా ఆపాల్సి వచ్చింది.
