గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి.. మంత్రి వివేక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్

గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి.. మంత్రి వివేక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీపై ఆసక్తి
  • గిగ్ వర్కర్ల భద్రత, ఆర్థిక భరోసా తదితర సమస్యలను వివరించిన మంత్రి


గిగ్ వర్కర్లకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీపై రాహుల్ ఆసక్తి చూపారు. ఇందు కోసం రాష్ట్ర కార్మిక శాఖ చేస్తున్న కసరత్తు, పాలసీలోని ముఖ్య అంశాలు, విధివిధానాలను ఆ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో గిగ్ వర్కర్లు, ఆ అసోసియేషన్ల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో తన దృష్టికి వచ్చిన.. గిగ్ వర్కర్ల భద్రత, ఆర్థిక భరోసా, మహిళ గిగ్ వర్కర్ల సమస్యలను రాహుల్ వివరించారు. ముఖ్యంగా దళిత, గిరిజనులు ఈ సెక్టార్లో ఎక్కువగా ఉన్నారని వారికి అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

అయితే.. గిగ్ వర్కర్లకు భద్రతతో పాటు గౌరవంగా బతికేలా తెలంగాణ కార్మిక శాఖ విధివిధానాలను రూపొందిస్తుందని మంత్రి వివేక్ వివరించారు. రాహుల్ చేసిన సూచనలు, ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తెస్తామన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ స్కూల్ ప్రాజెక్ట్ వివరాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. 

అంటరానితనం రూపుమాపేలా, మతసామరస్యం వెల్లివిరిసేలా.. సమాజాన్ని మార్చేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్లు రేవంత్ వివరించారు. గత సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకులాల పేరిట ప్రజల్ని విభజించిందని గుర్తు చేశారు. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఎలాంటి భేదాలు, వర్గాలు ఉండవన్నారు.