ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఇప్పట్లో అంతం లేనట్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రెయెసస్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కొవిడ్ అంతం దగ్గరలో లేదని చెప్పారు. అలాగే ఇప్పటికీ అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పెద్ద రిస్క్ లేదన్న ప్రచారాన్ని కూడా తప్పుబట్టారు. ఈ వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని వేగంగా కమ్మేస్తోందని, పైగా వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఈ వైరస్ మరింత ప్రమాదకరమని, తీవ్రమైన అనారోగ్యం, చావు ముప్పు ఎక్కువని చెప్పారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు చేయాల్సిన పని చేయాలని టెడ్రోస్ కోరారు. 

కార్చిచ్చులా వ్యాప్తి..

ఒమిక్రాన్ వేరియంట్ సోకితే లక్షణాలు మైల్డ్‌గానే ఉంటాయన్న ప్రచారాన్ని టెడ్రోస్ అదనమ్ కొట్టిపారేశారు. నవంబర్‌‌లో దక్షిణాఫ్రికాలో తొలి కేసు గుర్తించిన నాటి నుంచి ఈ కొత్త వేరియంట్ కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టేస్తోందని ఆయన అన్నారు. ‘‘గతంలో వచ్చి అన్ని వేరియంట్ల కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ప్రస్తుతానికి కొంత మేర వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే ఉండొచ్చు. కానీ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ తీవ్రత మైల్డ్‌గానే ఉంటుందన్న ప్రచారం మాత్రం తప్పుదోవ పట్టించడమే అవుతుంది” అని టెడ్రోస్ చెప్పారు. ఒమిక్రాన్ విషయంలో అలసత్వం పనికిరాదని, ఈ వేరియంట్ సోకినవాళ్లు కూడా ఆస్పత్రిపాలవుతున్నారని, మృతి చెందుతున్న కేసులూ ఉన్నాయని తెలిపారు.  హెల్త్ సిస్టమ్‌పై భారీగా కేసులు భారం వచ్చిపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కొవిడ్ జాగ్రత్తలను పక్కాగా పాటించాలని సూచించారు. 

వారానికి 45 వేల మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా వారానికి సుమారు 45 వేల మంది వరకూ కరోనాకు బలవుతున్నారని WHO టెక్నికల్ లీడ్ మరియా వ్యాన్ కెర్ఖోవ్ చెప్పారు. అన్ని రకాలుగా కొవిడ్‌ను నియంత్రించడానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో మరణాలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిని బట్టి ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు అంత సమర్థంగా పని చేయడంలేదని గుర్తించాలని అన్నారు. ఏ రకమైన వేరియంట్‌నైనా సమర్థంగా ఎదుర్కోగలిగే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనా రూల్స్‌‌ పాటిస్తే లాక్‌‌డౌన్‌‌ అక్కర్లే

డీకే అరుణ కుమార్తె ఫిర్యాదుపై స్పందించిన పీవీపీ

ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్