
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో రెండో రోజు మూడు రోజుల బీజేపీ శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నేతలతో పాటు ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. శిక్షణ శిబిరాలకు హాజరైన జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు నిన్న రాత్రి శిక్షణ శిబిరంలోనే బస చేశారు. మూడ్రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశాల చివరి రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు.
ఇవాళ రెండోరోజు సమావేశాల్లో దేశ నిర్మాణంలో బీజేపీ పాత్ర, మోడీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించనున్నారు. బలహీనవర్గాలకు మోడీ ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలపై డిస్కస్ చేస్తున్నారు. విదేశాంగ విధానం.. సాధించిన విజయాల గురించి శిక్షణ కార్యక్రమంలో నేతలు వివరించనున్నారు.
ఇవాళ రెండో రోజు శిక్షణ శిబిరాలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్ ,ఎంపీ అరవింద్ సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.