కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. యువ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో సీఎం ఇంటి ముందు ఆందోళన చేపట్టిన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్ద నున్న సీసీటీవీ కెమెరాలు, గేటు ధ్వంసం చేశారు. సీఎం ఇంటి గేటుకు కాషాయ రంగు పూశారు. ఆందోళనలో పాల్గొన్న తేజస్వీ సూర్య బారికేడ్లు ఎక్కుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దాదాపు 200 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. వారిలో 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఇదిలా ఉంటే బీజేవైఎం ఆందోళనపై ఆమ్ ఆద్మీ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం ఇంటి వద్ద బీజేపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు వారిని ఆపలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్  సిసోడియా ఆరోపించారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను  ట్విట్టర్ లో  షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఆప్ విజయంతో ఉలిక్కిపడిన బీజేపీ కేజ్రీవాల్ ను చంపాలని చూస్తోందా అని ప్రశ్నించింది.