రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలదొక్కుకునేనా?

రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలదొక్కుకునేనా?

తెలంగాణలో లోక్​సభ ఎన్నికల ఫలితాలు చాలామేరకు ఊహించినవే. రెండు జాతీయపార్టీలు సమానంగా సీట్లు గెలుచుకోవడం కొంత విచిత్రంగా అనిపించవచ్చు. దేశమంతటా కాంగ్రెస్​, బీజేపీలు ఒకదాని వ్యతిరేకతతో మరొకటి గెలిచాయి. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్​ఎస్​ వ్యతిరేక ఓటుతోనే ఆ రెండు పార్టీలు గెలిచాయి. ప్రజల్లో బీఆర్​ఎస్​ పట్ల వ్యతిరేకత  పోలేదని ఫలితాలే చెపుతున్నాయి. ఆ పార్టీ తెలంగాణకు అవసరమా అని  చెపుతున్నాయి కూడా. ప్రజల్లో ఆ పార్టీ పట్ల  5 నెలల్లోనే మరింత అధికంగా పెరిగిన నకారాత్మకతకు అది నిదర్శనం.

దేశమంతటా కాంగ్రెస్​ వ్యతిరేక ఓటరు బీజేపీని గెలిపిస్తే, బీజేపీ వ్యతిరేక ఓటరు కాంగ్రెస్​ను గెలిపిచారు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్​ఎస్​ పట్ల వ్యతిరేక ఓటర్లు ఒక్క పార్టీని కాకుండా, రెండు పార్టీలను సమానంగా గెలిపించుకున్నారు. ఇదొక విచిత్రమైన పరిణామంగా మనకు అనిపించవచ్చు, కానీ తెలంగాణ లోక్​సభ ఎన్నికల ఫలితాల సారాంశం మాత్రం ఇదే! బీఆర్​ఎస్​ స్థానంలో ప్రజలు మరొక పార్టీని కోరుకుంటున్నారని లోక్​సభ ఫలితాలు పరోక్షంగా చెప్పినట్లే! ఇంకా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్​, బీజేపీ మధ్యనే ‘బైపోలర్​ కాంటెస్ట్’​ జరగడం చూసినపుడు బీఆర్​ఎస్​ భవిష్యత్తు పై ప్రశ్న గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నది.

కాంగ్రెస్​ తన బలాన్ని నిలుపుకుంది

కాంగ్రెస్​పార్టీ తన ఓటు శాతాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఒకశాతం లోపు ఓట్లు అదనంగా సాధించుకోగలిగింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, లోక్​సభ ఎన్నికలు తన పాలనకు రెఫరెండమని చెప్పారు. ఆయన సవాలును ప్రజలు తిరస్కరించారని గానీ, అదే సమయంలో బలపరిచారని గానీ చెప్పడం సాధ్యంకాదు. మొత్తంమీద ఓటుశాతాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్​ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదని చెప్పొచ్చు.

 నిజానికి కాంగ్రెస్​పార్టీకి మరింత పాజిటివ్​ ఓటు పెరిగి ఉండాల్సింది. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో మరింత సకారాత్మకత పెరిగి ఉండాల్సింది. 8 స్థానాలు కాకుండా కనీసం 12 స్థానాలైనా గెలిచిఉండాల్సింది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకున్నా, కాంగ్రెస్​ 9 లోక్​సభ స్థానాల్లో గెలవాలి. కానీ 8 స్థానాలే గెలవగలిగింది. ఓటుశాతం కాస్తంత పెంచుకోగలిగింది తప్ప సీట్లు పెంచుకోలేకపోయింది. మొత్తం మీద కాంగ్రెస్​ బలం తగ్గలేదు, పెరగలేదని మాత్రం చెప్పొచ్చు.

బైపోలర్​ కాంటెస్ట్​తో బీజేపీకి లబ్ది

పేరుకు ట్రయాంగ్​లర్​ కాంటెస్టే అయినా దాన్ని బై పోలర్​గా మార్చింది మాత్రం ప్రజలే. దాంతో లబ్దిపొందింది బీజేపీనే. ముందే చెప్పుకున్నట్లు ప్రజలు బీఆర్​ఎస్​ ను పక్కన పెట్టి బీజేపీని కోరుకున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో మొదటిది బీఆర్​ఎస్​ పట్ల వ్యతిరేకత, రెండోది మోదీ ఫ్యాక్టర్​.  గ్రామీణ ప్రాంతాల్లోనూ యువకుల నుంచి వృద్ధుల దాకా మొదటిసారి మోదీ పేర ఓటేయడం కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక పెద్ద మార్పే. క్యాడర్​గానీ, ఏజెంట్లుగానీ లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీకి ఓట్లు రావడం ఇదే మొదటిసారి. 

మొత్తం 17 లోక్​సభ స్థానాల్లో బీజేపీ 8స్థానాలు గెలవడం, మరో 7 స్థానాల్లో రెండోస్థానంలో నిలవడం.. ఆ పార్టీ బీఆర్​ఎస్​ స్థానాన్ని ఆక్రమిస్తున్నదని చెపుతున్నది. 2019 లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీకి 19శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఏకంగా 35శాతం ఓట్లు సాధించింది. 15శాతం ఓట్లు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా స్థిరపడడానికి అదొక ఊతమిచ్చే విషయమే.

ఆశలు పెంచుకున్న బీజేపీ

లోక్​సభ ఫలితాల ఆధారంగా చూసినపుడు బీజేపీయే ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోవచ్చు అనే వాదన ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్​ 5 నెలల్లోనే చతికిలబడి లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకపోవడమే బీజేపీలో ప్రత్యామ్నాయ ఆశలను పెంచింది. అయితే బీజేపీ తెలంగాణలో తానే ప్రత్యామ్నాయం అని ఊహించుకోవడంలో తప్పు లేదు. కానీ రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ బీఆర్​ఎస్​ను రిప్లేస్​ చేసే ప్రత్యామ్నాయ రాజకీయాన్ని బలంగా నడపగలిగితేనే అది కాంగ్రెస్​కు బైపోలర్​ ప్రత్యర్థిగా నిలిచిపోయే అవకాశం ఉంది.

కాంగ్రెస్​పైనే కాదు, బీఆర్​ఎస్​ పై పోరాడితేనే..

గడిచిన పదేండ్లలో బీఆర్​ఎస్​ పాలనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్ప మోదీ ప్రభుత్వం ఏనాడూ చర్యలకు ప్రయత్నించలేదు. అది బీఆర్​ఎస్​- బీజేపీ ఒక్కటే అనే అనుమానాలకు తావిచ్చింది. ఇపుడు  తెలంగాణలో బీజేపీ పోరాడాల్సింది ఒక్క కాంగ్రెస్​ ప్రభుత్వంపైన మాత్రమే అనుకుంటే పొరపాటు. బీఆర్​ఎస్​పైన, దాని గత అవినీతి పాలనపై కూడా పోరాడాల్సి ఉంటది.  అపుడే బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పాత్రలో స్థిరపడగలుగుతుంది. బీజేపీ ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిందేమిటంటే, బీఆర్​ఎస్​ను రిప్లేస్​ చేస్తే తప్ప తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయ పాత్ర దక్కదని ఆ పార్టీ గమనించాలి. 

బీఆర్​ఎస్​ను తిరిగి కోరుకునే పరిస్థితి ఉందా?

పదేండ్లలో తెలంగాణను విధ్వంసం చేసిపెట్టిన బీఆర్​ఎస్​ తిరిగి పుంజుకోవాలని తెలంగాణలో కోరుకునేవారు లేకుండా పోతున్నారు. అది కాళేశ్వరమా, మిషన్​ భగీరథనా, ధరణియా, పవర్​ ప్లాంట్లా, గొర్రెల పథకమా.. ఎక్కడ విచారణ చేపట్టినా అంతటా అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. చివరకు ఫోన్​ట్యాపింగ్​లను ఉపయోగించి రాజకీయాలను, ప్రజాతీర్పులను అక్రమంగా శాసించిన బీఆర్​ఎస్​ తిరిగి పుంజుకోవాలని ఎవరైనా కోరుకునే పరిస్థితి ఉందా? పేరుకు చెప్పుకుందామంటే, అక్రమాలు జరగని పని ఒక్కటీ కనిపించడంలేదు.

 అవినీతికి తోడు కుటుంబపాలన, ప్రజలకు దూరంగా పాలకుడు..ఎన్నని చెప్పగలం? అలాంటి పార్టీనిగానీ, అలాంటి పాలనగానీ మళ్లీ కావాలని కోరుకునే పరిస్థితిలో తెలంగాణ ఉందా? అధికారం పోయాక కూడా నాయకుడిలో మార్పులేదు. ఓడించిన ప్రజలను నిందించడం తప్ప, తాను మారుతానన్న జాడలేదు. అలాంటి నాయకుడి పార్టీ తిరిగి నిలబడాలని, గెలవాలని.. తిరిగి అదే అవినీతి, కుటుంబ పాలన కావాలని తెలంగాణ కోరుకునే అవకాశాలు లేవు. కాబట్టే, బీఆర్​ఎస్​ రహిత ప్రత్యామ్నాయమే తెలంగాణకు మేలని బుద్ధిజీవుల అభిప్రాయం.

దృష్టి పెట్టకపోతే, మరో ప్రాంతీయ పార్టీ తప్పదేమో!

బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నాలపై దృష్టి పెట్టకపోతే మాత్రం తెలంగాణలో మరో ప్రాంతీయపార్టీ పుట్టుకొచ్చే అవకాశాలను ఎవరూ కొట్టేయలేరు. ఒకవేళ బీఆర్​ఎస్​ మళ్లీ బలపడినా, లేదా మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చినా అందుకు కారణం మాత్రం బీజేపే కానుంది.

ఎంపీ స్థానాలు మాత్రమే చాలనుకుంటే!

లోక్​సభ ఫలితాలతోనే ప్రత్యామ్నాయంగా మారిపోయామని బీజేపీ ఊహించుకుంటే మాత్రం పొరపాటు. పెరిగిన బలాన్ని నిలబెట్టుకుంటూ, రాబోయే ఐదేళ్ల కాలంలో మరింత బలపడే ప్రయత్నాలు చేస్తే తప్ప బీజేపీ కల నెరవేరదు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి లోక్​సభ స్థానాలపై ఉన్న శ్రద్ధ, అసెంబ్లీ స్థానాలపై అంతగా ఉండదని గత పదేళ్ల కాలంలోని అనుభవం చెపుతున్నది. 

ఇపుడు కూడా కేంద్ర నాయకత్వం అదే ధోరణిలోనే ఉంటే, ఆ పార్టీ తెలంగాణలో బలపడడం దుస్సాధ్యమనే చెప్పాలి. అలాగే, మునుపటిలాగ కేంద్రంలో ఇపుడు సొంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం కాదు. తెలంగాణపైన కూడా దాని ప్రభావం పడేనా? సంకీర్ణం మోదీకి బలమా? బలహీనతా? అనేది ఓ ఏడాది కాలం గడిస్తే కానీ బయటపడదు.   

స్థానిక నాయకత్వం అనివార్యం

తెలంగాణలో బలమైన స్థానిక నాయకత్వాన్ని తయారు చేయడంలో బీజేపీ  కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఘోరంగా విఫలమైంది. ఒకరాష్ట్రంలో ఒక పార్టీ బలపడాలంటే, బలమైన స్థానిక నాయకత్వానికి స్వేచ్ఛాపూరితమైన బాధ్యతలు ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీకి రేవంత్​రెడ్డి నాయకత్వం పనికొచ్చింది. ఆ పార్టీని అధికారంలోకి కూడా రాగలిగింది.

 కానీ బీజేపీలో  బలపడుతున్న బండి సంజయ్​ నాయకత్వాన్ని   ఎందుకు తొలగించారో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో  బలమైన స్థానిక నాయకత్వాన్ని ఇప్పటికైనా కోరుకుంటున్నదా లేదా అనేదే ఆ పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకం. 

కాంగ్రెస్​కు ప్రత్యర్థి ఎవరు?

తెలంగాణలో కాంగ్రెస్​ అస్తిత్వానికి చావులేదు.  అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ఏ పాత్రలోనైనా తెలంగాణలో ఆ పార్టీ  అస్తిత్వం కొనసాగుతుంది తప్ప కనుమరుగయ్యేది కాదు. తేలాల్సిందల్లా కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా స్థిరపడేది బీజేపీనా, బీఆర్​ఎసా అనేదే. తెలంగాణ రాజకీయాలు బైపోలర్​గా మారాయి. ట్రయంగ్​లర్​ రాజకీయాలకు చోటు లేదని గత అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా బీజేపీ, బీఆర్​ఎస్​లలో ఏదో ఒక పార్టీ మిగలకతప్పదు. 

 కల్లూరి
శ్రీనివాస్​ రెడ్డి,
సీనియర్​ జర్నలిస్ట్